కలిసి కదలాలి.. కలాహాలు వద్దు

4

– రాహుల్‌

తిరువనంతపురం,ఫిబ్రవరి 10(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా అంతఃకలహాలు వీడి కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాడాలని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సూచించారు. రాహుల్‌ ఈరోజు కేరళలో జరిగిన కేపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశానికి హాజరై ప్రసంగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. అంతర్గత పోరాటాలకు ఇది సమయం కాదన్నారు. సీపీఎం కాంగ్రెస్‌ను ఓడించలేదని… కాంగ్రెస్‌ మాత్రమే కాంగ్రెస్‌ను ఓడించగలదని అన్నారు. పార్టీలో టాలెంట్‌ ఉన్న సీనియర్‌ నేతలు ఉన్నారని.. వారు ఒక్కొక్కరిగా కంటే, కలిసి ఉంటే అధిక లాభం జరుగుతుందన్నారు. కేరళలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కేలా కృషి చేయాలని చెప్పారు. బిహార్‌లో భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ జేడీయూ, ఆర్జేడీలతో కలిసి పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని రాహుల్‌ గుర్తుచేశారు. సమావేశంలో రక్షణ శాఖ మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఏకే ఆంటోనీ, కేరళ సీఎం వూమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ ఇంఛార్జి ముకుల్‌ వాస్నిక్‌ తదితరులు పాల్గొన్నారు.