కలిసి కదిలితే భాజపాను మట్టికరిపించొచ్చు

– శరద్‌ యాదవ్‌ సభలో రాహుల్‌

న్యూఢిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి):కలసి పోరాడడం ద్వారా అధికార బిజెపిని కతం చేద్దాం అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మనం కలిసి పోరాడితే, వీళ్లు (బీజేపీ) ఎక్కడా కనిపించరు అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అన్నారు. జనతాదళ్‌ యునైటెడ్‌ అగ్ర నేత శరద్‌ యాదవ్‌ గురువారం నిర్వహించిన సంఝి విరాసత్‌ బచావో (వారసత్వాన్ని కాపాడండి) సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికెళ్ళినా అబద్ధాలే చెప్తున్నారన్నారు. ప్రజలు ‘సచ్‌ భారత్‌’ను కోరుకుంటున్నారన్నారు. మోదీ ఆర్భాటంగా ప్రకటించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఓ ప్రహసనమని ఎద్దేవా చేశారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విభజన ఎజెండాను అనుసరిస్తోందన్నారు. ఒకరు ఈ దేశం నాది అంటారు, మరొకరు నేను ఈ దేశానికి చెందినవాడిని అంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు, మాకు అదే తేడా అన్నారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో శరద్‌ యాదవ్‌తో పాటు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ,టీఎంసీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘స్వచ్ఛ్‌భారత్‌’ కావాలని కోరుకుంటున్నారు.. కానీ ప్రజలు మాత్రం ‘సచ్‌ భారత్‌’ కావాలని అనుకుంటున్నారని రాహుల్‌ విమర్శించారు. మేక్‌ ఇన్‌ ఇండియా గురించి ప్రస్తావిస్తూ.. ఇక్కడ లభ్యమయ్యే ఉత్పత్తులు ఎక్కువగా చైనాలో తయారైనవే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘2014 ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హావిూలను ప్రభుత్వం ఏవిూ నెరవేర్చలేకపోయింది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని రాహుల్‌ ఆరోపించారు.