కలువనున్న రెండాకులు

– నేడో,రేపో ఏఐడీఎంకే విలీనం ప్రకటన

చెన్నై,ఆగష్టు 18(జనంసాక్షి):తమిళనాడులో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గాలు ఒక్కటి కాబోతున్నాయి. అయితే విలీనానికి పన్నీర్‌ వర్గం పెట్టిన షరతులకు సీఎం పళనిస్వామి అంగీకరించినట్లు తెలుస్తోంది. పన్నీర్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు రెండు మంత్రి పదవులు ఇచ్చేందుకు పళని సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మ సమాధి వేదికగా ఇరు వర్గాలు వేర్వేరు సమావేశాలు నిర్వహించాయి. నేడో, రేపో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు అన్నాడీఎంకే వర్గాల విలీనానికి జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం శశికళ వర్గం అప్రమత్తమైంది. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను శుక్రవారం మధ్యాహ్నాం దినకరన్‌ కలుసుకున్నారు. దినకరన్‌ వెంట ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. శుక్రవారమే పుట్టిన రోజు కావడంతో శశికళకు శుభాకాంక్షలు తెలిపారరు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, అన్నాడీఎంకే వర్గాలు విలీనం కానుండటం వంటి అంశాలను శశికళ దృష్టికి దినకరన్‌ తీసుకువచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాల చెప్పాయి. పార్టీపై పట్టు సాధించేందుకు దినకరన్‌ ఇటీవల మధురైలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఇద్దరు ఎంపీలతో సహా మొత్తం 20 మంది ఎమ్మెల్యేల బలం తనకుందని దినకరన్‌ చాటుకోవడం, పళనిస్వామి సర్కార్‌పై నిప్పులు చెరిగిని నేపథ్యంలో శశికళను దినకరన్‌ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.