కలెక్టరేట్ ఎదుట ధర్నా
నిజామాబాద్,అక్టోబర్ 20 : హైవేలపై ఆటోలను నడపరాదంటూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధికి ఎసరు పెట్టే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సదాశివనగర్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఆటోలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదన్న కారణంతో ఆటో డ్రైవర్లపై వేధింపులకు పాల్పడడం సరైంది కాదని అన్నారు. ప్రమాదాలు జరగకుండా నియంత్రణా చర్యలు చేపట్టకుండా, ఆటో కార్మికులను బాధ్యులను చేయడం సరైంది కాదని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించి స్పీడ్‌గా వెళ్లే వాహనాలను అదుపు చేయాలని సూచించారు. ప్రభుత్వం రవాణా రంగంలో తీసుకు వస్తున్న సంస్కరణల వల్ల ఆటో కార్మికుల సంక్షేమానికి ఎసరు పెట్టే చర్యలను వీడనాడకపోతే జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భందిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు రవి, నర్సింలు, వెంకటి, ప్రసాద్, సంతోష్‌గౌడ్, సతీష్, భానుశర్మ తదితరులు పాల్గొన్నారు.