కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న అధికారులు
ఖమ్మం, డిసెంబర్ 12 : ఖమ్మం పట్టణ మీదుగా వెళ్తున్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఇచ్చిన ఆదేశాలు నేటివరకు అమలుకు నోచుకోలేదు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి 8 నెలలు దాటినా కూడా సర్వే జరిపి హద్దులు నిర్ణయించడంలో సర్వే విభాగం అధికారులు నేటికి అనేక కుంటిసాకులు చెబుతున్నారు. మునేరు నది నుంచి ఖానాపురం హవేలి, వి.వెంకటాయపాలెం, కొనిజర్ల, రామనర్సయ్యనగర్ వరకు ఖమ్మం ఎన్‌ఎస్‌సి డివిజన్ పరిధిలోని 17 కిలో మీటర్ల పొడవున నాగార్జున సాగర్ కాల్వకు రెండువైపుల హద్దులు నిర్ణయించి రాళ్లు పాతాలని కలెక్టర్ గత మే నెలలో ఆదేశించారు. ఎంత విలువైన ఎన్‌ఎస్‌సి భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, పలువురు అక్రమణలకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. కాల్వకు రెండు వైపుల హద్దులు నిర్ణయించి రాళ్లు పాతాలని దీంతో అక్రమణలను నిరోధించవచ్చని అన్నారు. ఇందులో భాగంగా గత మే నెలలో ఖమ్మం ఎన్‌ఎస్‌సి డివిజన్ కార్యాలయం అధికారులు 8.8 లక్షల అంచనాతో టెండర్లు నిర్వహించారు. సరిహద్దులు నిర్ణయించాలని కోరుతూ ఎన్‌ఎస్‌సి అధికారులు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడికు ఇప్పటికే చాలా లేఖలు రాశారు. సర్వే విభాగం వారు మాత్రం తమకు తీరిక లేదంటూ తప్పించుకుంటూ సరిహద్దులు నిర్ధారించడంలో జాప్యం చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమణదారుల నుంచి సర్వే విభాగంలోని అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్వే విభాగం అధికారులు సాగర్ కాల్వకు ఎప్పుడు సరిహద్దులు నిర్ణయిస్తారో తెలియని దుస్థితి నెలకొంది.