‘కల్చర్ యునైట్స్ ఆల్’

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యతే మనందరిని కలుపుతోంది

– సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దాం

– భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం ‘వారణాసి’లో జీ-20 సాంస్కతిక శాఖ మంత్రుల సదస్సులో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి  జి.కిషన్ రెడ్డి

– ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా ‘కాశీ కల్చరల్ పాత్‌వే’కు ఏకగ్రీవ ఆమోదం

– పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులనుంచి ప్రపంచాన్ని కాపాడుకునేందుకు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పలు కీలకాంశాలపై సమావేశంలో నిర్ణయం

26 ఆగస్టు, 2023, వారణాసి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతులను పరిరక్షించుకుంటూ వాటిని ప్రోత్సహించడం ద్వారా అందరం ఒకతాటిపైకి వస్తూ..సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దామని.. జీ20 దేశాలు, ఆతిథ్య దేశాలకు భారత సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందని ఆయన అన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందని ఆయన అన్నారు.

భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జీ-20 దేశాలు, ఆతిథ్యదేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందన్నారు. విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు.

భారత నేతృత్వంలోని జీ20 సమావేశాల్లో భాగంగా జరిగిన.. మొదటి మూడు కల్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశాల్లో, గ్లోబల్ థిమాటిక్ వెబినార్స్‌ల ద్వారా కీలకమైన అంశాలపై చర్చ జరిగిందని.. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఫలితాలు సాధించే లక్ష్యంతో అంతర్జాతీయంగా విధానాల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు, పరస్పర సహకారం ద్వారా ఈ విధానాల అమలు తదితర అంశాలపై శనివారం నాటి సాంస్కృతిక మంత్రుల సమావేశంలో కీలక చర్చజరిగింది.

ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా.. ‘కాశీ కల్చరల్ పాత్‌వే’కు రూపకల్పన జరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్‌లలో తీసుకున్న నిర్ణయాలు, వాటిని ఎంతవరకు అమలు చేశామనే అంశాల ఆధారంగా.. అందరు సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్‌వే’ను రూపొందించామన్నారు.

అందరి సంయుక్త బాధ్యత, అందరి భాగస్వామ్యంతో.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని దాన్ని అమలు చేయడంతోపాటుగా.. సంయుక్తంగా సాంస్కృతిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

‘కాశీ కల్చరల్ పాత్‌వే’లోని కొన్ని ముఖ్యాంశాలు

– సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టంగట్టాలని నిర్ణయించారు.

– సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి.

– సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం.

– అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం.

– ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని నిర్ణయించారు.

– రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి.