కల్తీ కల్లు కల్లోలం

5

కల్తీ కల్లు కాటుకు ఏడుగురి బలి

– పిచ్చెక్కుతున్న బాధితులు

హైదరాబాద్‌,సెెప్టెంబర్‌22(జనంసాక్షి):

కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయం ఏడుగురు మృతి చెందారు.ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఐదు మంది మృతిచెందారు.గద్వాల వేదానగర్‌లో కల్తీకల్లు ప్రభావంతో నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తపల్లిలో కల్తీకల్లు ప్రభావంతో అస్వస్థతకు గురై మరో మహిళ మృతిచెందింది. దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌ గ్రామంలో కల్తీకల్లుకు బానిసైన వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో 75 మంది కల్తీకల్లు బాధితులు చికిత్సపొందుతున్నారు. కొందుర్గ్‌లో దాదాపు 50 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  కల్లు అందుబాటులో లేకపోవటంతో  కల్లు బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. మంగళవారం 50మంది బాధితులు వింత చేష్టలతో కొందుర్గ్‌ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు దొరక్కపోవటంతో మానసికంగా కుంగిపోయి విచిత్రంగా అరవటం, కర్రలతో కుటుంబసభ్యులపై దాడికి పాల్పడటం, అర్థరాత్రి తలుపులు తీసి బయటకు పరుగెత్తడం లాంటి వింత చేష్టలు చేస్తున్నారని బాధితుల బంధువులు చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల బైపాస్‌రోడ్డులో కల్లీ కల్లు దొరక్క అస్వస్థతకు గురై రిక్షాకార్మికుడు మృతిచెందాడు.