కల్తీ నూనె వ్యాపారంతో ప్రజలకు చెలగాటం
సిరిసిల్ల,మే4(జనంసాక్షి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న వేములవాడ పట్టణం కల్తీ నూనెల వ్యాపార కేంద్రంగా మారింది. వేములవాడలో కొంత మంది టోకు వ్యాపారులు పెద్ద ఎత్తున కల్తీ వ్యాపారానికి తెరతీశారు. వేములవాడలోని రహస్య ప్రాంతాల్లో నూనెల గోదాంలను ఏర్పాటు చేసి కల్తీ
నూనెల దాందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. వేములవాడ చుట్టు పక్కల మండలాలకు వేములవాడ కేంద్రంగానే భారీ ఎత్తున కల్తీ నూనెల సరఫరా జరుగుతోంది. పల్లీలు, పొద్దుతిరుగుడు నూనెల్లో తక్కువ ధర ఉన్న నూనెలతోపాటు రసాయన పదార్థాలను కల్తీ చేస్తూ విడిగా డబ్బాల్లో, వివిధ కంపెనీల పేరుతో నూనెలు విక్రయిస్తూ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి ఏటా కోట్లలో ఈ నూనెల వ్యాపారం జరుగుతోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల వరుసగా దాడులు చేసిపెద్ద ఎత్తున కల్తీ నూనెలు పట్టుకున్నారు. అయినా వేములవాడలో ఈ అకమ్ర దందా మాత్రం ఆగడం లేదు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు జరుగుతున్నప్పటికి కల్తీ నూనెల వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలుండటంతో అక్రమ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. వివిధ కంపెనీల పేర్లతో కామారెడ్డి నుంచి నూనెల ప్యాకెట్లు, 5 లీటర్ల డబ్బాలు దిగుమతి చేసుకొని గోదాములల్లో నిల్వ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వాటిపైన తయారీ తేది, గడువు తేది, ఇతర వివరాలు ఉండటంలేదు. కల్తీ నూనె వ్యాపారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వినయోగదారుల మండలి డిమాండ్ చేస్తోంది. నాసిరకమైన వస్తువులు, కల్తీ నూనెలతో ఎవరైన ఇబ్బందులు ఎదుర్కొంటే వినియోగదారుల మండలిలో కేసులు వేయాలని సూచిస్తోంది.