కల్తీ మద్యం అమ్మితే కఠిన చర్యలు

కల్తీ మద్యం అమ్మితే కఠిన చర్యలు

మహబూబ్ నగర్ బ్యూరో (జనం సాక్షి)

రాష్ట్రంలో ఎవరైనా కల్తీ మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని , ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజల ఆరోగ్యంతో జలగాటమాడే వారిపై పిడి యాక్ట్ లు పెడతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు .
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్వీఎస్ ఆసుపత్రి వెనుక నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు . సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మద్యం అమ్మకం దారులు, లైసెన్సుదారులు డూప్లికేట్ మద్యం కంపెనీలు ఏర్పాటు చేసి కల్తీ మద్యం కల్లును అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే కాకుండా వారి జేబులు నింపుకున్నారని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం తోపాటు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలను కట్టుదిట్టం చేశామన్నారు .రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు , సిబ్బంది కృషి వల్ల ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు . అన్ని శాఖలకు గౌరవం దక్కిన విధంగానే ఎక్సైజ్ శాఖకు గౌరవం వచ్చేలా చర్యలు తీసుకున్నామని , రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కాపాడుతున్నామని అన్నారు. డిపార్ట్మెంట్లోని అధికారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించామని, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని , మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు .
మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, వెనకబడిన వార్డులలో సైతం సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. మహబూబ్నగర్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లా కార్యాలయంలో ఎక్కువగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న దృష్ట్యా ఎక్సైజ్ కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సంబంధించిన సమస్యలను తీర్చాలని ఆదేశించారు. ఎక్సైజ్ కార్యాలయం పక్కనే భవిష్యత్తులో అతిథి గృహం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు . 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు , అవాంతరాలు వచ్చినా శాఖలో అందరికీ పదోన్నతులు, బదిలీలు, అన్ని సౌకర్యాలు కల్పించామని , ఎక్సైజ్ శాఖ రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ , ఎస్పీ కే. నరసింహ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య , ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తు రాజు గౌడ్ , ఎక్సైజ్ సూపరింటిండెంట్ సైదులు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డిసిసిబి ఇన్చార్జి అధ్యక్షులు కోరమని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు, కౌన్సిలర్లు వనజ, కట్ట రవి కిషన్ రెడ్డి ,ఎక్సైజ్ శాఖ సి ఐ వీరారెడ్డి, అధికారులు , ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.