కవితలా తండ్రి, అన్నపై ఆధారపడలేదు
– డీఎస్ డిక్టేటర్ కాదు.. తాను బానిసను కాదు
– జిల్లాలో నాలుగేళ్లలో కవిత చేసిన అభివృద్ధి శూన్యం
– బీజేపీ నేత, డీఎస్ తనయుడు అరవింద్
నిజామాబాద్, జూన్28(జనం సాక్షి) : టీఆర్‌ఎస్ ఎంపీ కవితపై డీఎస్ తనయుడు అరవింద్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారంటూ మండిపడ్డాడు. తమ కుటుంబంపై అర్థరహితంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్ తనను బీజేపీలోకి పంపారన్న టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను అరవింద్ ఖండించారు. కవితలా తాను తండ్రి, అన్నపై ఆధారపడి లేనని ఎద్దేవా చేశారు. తమ కుటుంబంలో నాన్న డిక్టేటర్ కాదు…తాను బానిసను కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కుటుంబాన్ని తీసుకురావొద్దని అన్నారు. రాజకీయంగా ఎదగాలని ఉంటే 2004లోనే ఎదిగేవాన్నని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో నాలుగేళ్లుగా కవిత చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. బీజేపీని వీడేది లేదని…మోదీ కోసం ప్రాణమిస్తానని డీఎస్ తనయుడు అరవింద్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుణపాఠం తప్పదని అరవింద్ హెచ్చరించారు. తాను రాజకీయంగా నేనెప్పుడూ నాన్న సహాయం తీసుకోలేదని, ఎవరి రాజకీయ వారివన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన అన్న రాజేశ్వర్‌రావు ఏకకాలంలో భాజపా, సీపీఐ ఫ్లోర్ లీడర్లుగా పని చేశారని, అలాంటిది నేను, నాన్న వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేముంది’ అని అర్వింద్ ప్రశ్నించారు. ఇప్పటికైన కవిత తన పార్టీలోని అంతర్గత విషయాలకు తనకు ముడిపెట్టవద్దని సూచించారు. ఇలాంటి రాజకీయాలు చేసేబదులు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెడితే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేయవచ్చునని గుర్తించాలని హితవు పలికారు.