కవిత ప్రచారంతో టిఆర్‌ఎస్‌లో జోష్‌

జిల్లాలో నేతల్లో నూతనోత్సాహం

జగిత్యాల,నవంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ప్రచారంతో పట్టణాలు, గ్రామాలు సందడిగా మారుతున్నాయి. ఎంపి కవిత గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. డాక్టర్‌ సంజయ్‌, కొప్పుల ఈశ్వర్‌,విద్యాసాగర్‌ రావుల తరఫున జోరుగా ప్రచారం చేపట్టారు. ర్యాలీలతో ప్రజల్లో ఉత్సాహం నింపారు. అలాగే అభ్యర్థుల్లో భరోసా నింపారు. ప్రచారానికి వచ్చిన నేతలకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికి మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఆహ్వానించారు. కవిత సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇంటింటా ప్రచారం చేయగా.. పలువురు స్థానికులు గులాబీ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజల కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేసే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎంపి కవిత తన ప్రచారంలో పిలుపునిచ్చారు. తమ నేతలు స్థానికంగా ఉంటూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాయమాటలు విని ప్రజలు మోసపోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, అధికారులు తెలంగాణలో పర్యటిస్తూ సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకొని ప్రశంసిస్తుంటే స్థానిక కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మాత్రం సంక్షేమ పథకాలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగేళ్లలో అభివృద్ధి పనులు చేసినట్లు ఆమె వివరించారు. ప్రజలు తాము చేసిన పనిని గుర్తించి ఓటు వేయాలని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నాలుగు సంవత్సరాల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఉపాధి మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు పేదల పాలిట వరంగా మారాయన్నారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.