కశ్మీర్‌పై ట్రంప్‌ మళ్లీ అదేపాట!


– భారత్‌, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధం
– ఎన్‌బీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యలు
వాషింగ్టన్‌, ఆగస్టు21 (జనంసాక్షి):   కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పూటకో మాట మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమంటూ ఆయన బుధవారం మరోసారి ప్రకటించారు. భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోనే కశ్మీర్‌ సంక్షోభానికి తెరపడుతుందని చెబుతూనే మరోవైపు ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. దాయాది దేశాల ప్రధాన మంత్రులు నరేంద్రమోదీ, ఇమ్రాన్‌ ఖాన్‌లతో ఫోన్‌లో మాట్లాడిన మరుసటి రోజే ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎన్‌బీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ట్రంప్‌ స్పందిస్తూ.. కశ్మీర్‌ అంశం చాలా క్లిష్టమైనదని, అక్కడ హిందువులు, ముస్లింల మధ్య సంబంధాలు మంచిగా లేవని పేర్కొన్నారు. పరిస్థితులు చేజారకముందే ఈ సమస్య పరిష్కారం కావాలని, కశ్మీర్‌లో శాంతి నెలకొనేలా సహాయపడేందుకు నేను సిద్ధమని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కశ్మీర్‌లో
ఉద్రిక్తతలను తగ్గించేలా ఇరు దేశాలూ నియంత్రణ పాటించాలంటూ ట్రంప్‌ మంగళవారం ఫోన్‌ చేసి ఇరు దేశాలను కోరారు. ప్రధాని మోదీతో మాట్లాడిన వెంటనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు ఫోన్‌ చేసిన ట్రంప్‌… భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. కాగా గత నెలలో ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ… కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోదీ కోరారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.  అయితే కొద్ది సేపటికే ట్రంప్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్‌… ఆయన మధ్యవర్తిత్వం అక్కర్లేదరటూ సున్నితంగా తిరస్కరించింది. ఇది తమ అంతర్గత వ్యవహారమనీ… ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని తేల్చిచెప్పింది. తాజాగా మళ్లీ ట్రంప్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.