కశ్మీర్‌లో ఉగ్రవాది పట్టివేత
పాక్ పన్నాగాలు రాబట్టేయత్నం
శ్రీనగర్,అక్టోబర్7(జనం సాక్షి): కశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న భారత భద్రతా దళాలకు సోమవారం మరో భారీ విజయం లభించింది. బారాముల్లా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. పట్టుబడిన ఉగ్రవాదిని బారాముల్లా పాత బస్తీకి చెందిన మొహ్సీన్ మంజూర్ సల్హెయాగా గుర్తించారు. దీనిపై రక్షణ రంగ నిపుణుడు ఖమర్ ఆఘా స్పందిస్తూ.. భద్రతా దళాలకు ఇది భారీ విజయమని చెప్పాలి. ఎందుకంటే అతడి నుంచి ఇంటిలిజెన్స్ అధికారులు, భద్రతా సిబ్బంది పెద్దఎత్తున సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఉగ్రవాదులను నడిపిస్తున్నది ఎవరు, ఎలాంటి ఆయుధాలు వారికి అందుతున్నాయి, ఏ విధంగా వారికి శిక్షణ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఉగ్రవాదులు పాగా వేశారు… ఇలాంటి వివరాలన్నీ అతడి నుంచి రాబట్టే అవకాశం ఉంది…’ అని పేర్కొన్నారు. ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం అనేది అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులకు ఇది భారీ విజయమని విశ్రాంత మేజర్ జనరల్ పీకే సెహగల్ పేర్కొన్నారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాదిని అరెస్టుచేయడం ద్వారా ఓ భారీ ఉగ్రదాడిని నిరోధించామని… అతడి నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని జమ్మూ కశ్మీర్ డీజీ దిల్‌బాగ్ సింగ్ పేర్కొన్నారు.