కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

– ఓ జవానుతోపాటు ఇద్దరు పౌరులకు గాయాలు
శ్రీనగర్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
బుద్గాం జిల్లాలోని పఖేర్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతాసిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది పైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
రోవైపు బారాముల్లాలోని సోపోర్‌ ప్రాంతంలోనూ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. నిఘా వర్గాల సమాచారంతో సాగిపొరా గ్రామంలో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని హతమార్చారు. ముష్కరుల కాల్పుల్లో ఓ జవాను గాయపడినట్లు పోలీసులు తెలిపారు.