కశ్మీర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

శ్రీనగర్‌: కశ్మీర్‌లో గురువారం పలుచోట్ల మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. కుప్వారా, బారాముల్లా, బందిపొరా, గందేర్‌బల్‌ ప్రాంతాల్లో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సంఘ వ్యతిరేక పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాతే సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

హంద్వారా ఘటనతో కశ్మీర్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక యువతిపై భద్రతా సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న పుకార్లు రావడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. భద్రతాసిబ్బందిపై రాళ్లు విసిరి నిరసన చేపట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ క్రికెటర్‌ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.