కశ్మీర్‌ సీఎం కన్నుమూత: ప్రముఖుల సంతాపం

5హైదరాబాద్‌: జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌(79) కన్నుమూశారు. మెడనొప్పి జ్వరంతో బాధపడుతున్న ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ డిసెంబర్‌ 24న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గత 10 రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఆరోగ్యం పూర్తిగా విషమించి గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పీడీపీ, భాజపా కూటమితో ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ 2015 మార్చి 1న జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

జమ్మూకాశ్మీర్‌లో 7 రోజుల సంతాప దినాలు

జమ్మూకాశ్మీర్‌లో ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇవాళ ఢిల్లీలో మరణించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మరణంతో కశ్మీర్ యూనివర్సిటీలోని అన్ని పరీక్షలను వాయిదా వేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ కూడా గురువారం నిర్వహించాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. ముఫ్తీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ వెళ్లనున్నారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ముఫ్తీ పార్దీవదేహానికి ప్రధాని మోదీ పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఓ కశ్మీర్ రాజకీయ వేత్త సీఎం హోదాలో ప్రాణాలు విడవడం ఇది రెండోసారి. 1982లోనూ అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా కూడా సీఎం హోదాలోనే కన్నుమూశారు.

ప్రముఖుల సంతాపం
జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌(79) దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం
తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.