కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్న కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు:
మెదక్‌ : కుమార్తె అన్నం తినడం లేదని చిన్నారిని చితకబాదిన ఘటనలో తండ్రి నాగరాజును అరెస్టు చేసినట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. మెదక్‌ పట్టణానికి చెందిన మాడిశెట్టి నాగరాజు, మౌనికలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మెదక్‌ పట్టణ శివారులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్నారు.
మెదక్‌ మున్సిపాలిటీలో రోజువారీ కూలీగా(ట్రాక్టర్‌ డ్రైవర్‌)గా నాగరాజు పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా నాగరాజు మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో మొదటి భార్య నాగరాజుతో గొడవపడి పుట్టింటికీ వెళ్లిపోయింది. ఆదివారం రాత్రి కుమార్తెతో కలిసి రెండో భార్య వద్దకు వెళ్లాడు. కుమార్తె అన్నం తినడం లేదని చితకబాదుతున్న సందర్భంలో చుట్టుపక్కల వారు వీడియో తీశారు. దాన్ని సోమవారం ఉదయం సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారితోపాటు తండ్రి నాగరాజు, రెండో భార్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తండ్రి నాగరాజుపై సుమోటా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. బాలలపై ఎవరైనా తమ ప్రాంతాల్లో అఘాయిత్యాలకు పాల్పడినా లేక హింసకు గురైనా వెంటనే 1098 లేదా డయల్‌ 100కి సమాచారం అందించాలని తమ సిబ్బంది ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, మెదక్‌ డీఎస్పీ సైదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
***
తండ్రి చేతిలో గాయపడ్డ పాపను, ఆమె తల్లిని మెదక్ ఎస్పీ చందన దీప్తి గారు కలిసి మాట్లాడటం జరిగింది. పాపకు ఎక్కెడెక్కడగాయాలు అయ్యాయో పాపను అడిగి తెలుసుకొని, పాపకు మంచి పౌష్టికాహారం అందేలా తల్లితో పాటు ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉండేలా ఎస్పీ గారు ఏర్పాటు చేశారు.