కస్తూర్భాగాంధీ స్కూల్ ప్రత్యేకాధికారిగా మహిళను నియమించాలి
ఖమ్మం, జూలై 24 : పాల్వంచ పట్టణంలోని బొల్లోరిగూడెంలోని బాలికల కస్తూర్భాగాందీ స్కూల్ ప్రత్యేకాధికారిగా మహిళను నియమించాలని అఖిలభారత షెడ్యూల్డ్ తెగల, కులాల, హక్కుల పరిరక్షణ సంఘం గౌరవాధ్యక్షుడు భాస్కరరావు కలెక్టర్‌ను కోరారు. కస్తూర్భాగాంధీ బాలికల స్కూల్‌కు ప్రత్యేకాధికారిగా స్థానికుడైన ఉపేందర్‌ను నియమించినా కూడా విధులను, విద్యార్థులను నిర్లక్ష్యం చేయడంతో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులకు సమయానికి భోజనం అందించడంలేదని ఆరోపించారు. బడిబయట ఉన్న అనేక మంది బాలికలను ఈ కారణం చేత బడిలో చేర్పించడం లేదని ఆరోపించారు. మెను ప్రకారం పౌష్ఠికాహారం ఇవ్వకపోవడంతో విద్యార్థినులు జ్వరాల బారిన పడుతున్నారని ఆరోపించారు. గిరిజన విద్యార్థినులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రత్యేక అధికారి ఉపేందర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో మహిళా అధికారిని నియమించాలని, స్కూల్ సమస్యలపై ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించాలని ఆయన కోరారు.