కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతాం
` అభివృద్ధిని చూసి ఓటేయండి..
` దాసరి మనోహర్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలి
` మంత్రి కేటీఆర్ పిలుపు
పెద్దపల్లి/గోదావరిఖని (జనంసాక్షి):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీర్ హాజరయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు అన్నారు. ఎంఎల్‌సి ప్రభుత్వ చీఫ్ విప్ టి బానుప్రసాద్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో రైతులకు 24 గంటలు కరెంటు, రైతు బీమా, రైతుబంధు, అలాగే బీసీ, ఎస్ సి, మైనారిటీలకు వివిధ రకాల కుల వృత్తులకు ఎన్నో పథకం ప్రవేశ పెట్టి ముందుకు సాగుతున్న కెసిఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రి చేయాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కల్లిబొల్లి మాటలకూ మోసపోవద్దని, ఏనాడు ప్రజల కష్టాలు పట్టించుకోని కాంగ్రెస్ కు ఓటేస్తే మోసం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బస్ డిపోతో పాటు పార్క్, అభివృద్ధికి మరో 50 కోట్లు నిధులు మంజూరు చేస్తామన్నారు.
రామగుండంను దత్తత తీసుకుంటా : కేటీఆర్
సకల హంగులతో అన్ని రంగాలలో రామగుండం అభివృద్ధి చెందేలా స్వయంగా బాధ్యత వహిస్తానని, రాబోయే 5 సంవత్సరాలలో మరింత ధీటుగా రామగుండం అభివృద్ధి జరిగేలా దత్తత తీసుకోవడం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. రామగుండం పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొని, 60 కోట్లతో నిర్మించే ఇండస్ట్రీయల్ పార్క్, 30 కోట్లతో నిర్మించే ఐటీ టవర్, 100 కోట్ల టి.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులతో చేపట్టే రామగుండం పట్టణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన రామగుండం దశాబ్ది సభలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లతో కలిసి పాల్గొన్నారు. సింగరేణిపై కుట్ర సాగుతుందని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దేశానికి చాటి చెప్పడంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతంలో కరకట్ట ఏర్పాటు చేయాలని, రాజీవ్ రహదారి వద్ద రోడ్డు ఫ్లైఓవర్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. దశాబ్దాలుగా పెండిరగ్ లో ఉన్న కుర్జు కమ్మి , సింగరేణి భూముల శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని , అదేవిధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని , మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని , జర్నలిస్టులకు ఇంటి పట్టాలను అందించాలని, 2 ఇంక్లైన్, 5 ఇంక్లైన్ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు.