కాంగ్రెస్‌కు కలసి వచ్చిన కర్నాటకం
కర్నాటక రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలసి వచ్చాయి. అధికారంలోకి రాకున్నా కింగ్‌మేకర్‌గా మారింది. ఓ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇదే అవసరం. ప్రాంతీయ పార్టీలను తన గూటికి చేర్చుకుని జాతీయ స్థాయిలో మరోమారు బలోపేతం కావడానికి కర్నాటకం దోహదపడిందనే చెప్పాలి. ఓ రకంగా కర్నాటకలో అధికారం పోయినా అధికారం తనగుప్పిటే ఉంచుకున్నట్లు అయ్యింది. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టాలని జరగుతున్న వ్యవహారాలన్నీ కాంగ్రెస్ లేకుండా సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కేంద్రంగానే బిజెపికి వ్యతిరేకంగా జట్టుకట్టాల్సిన అవసరం ఏర్పడింది.ఇక భవిష్యత్‌లో ఎప్పుడైనా మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో తెలియని దశలో కర్నాటకలో జనతాదళ్ ఉంది. ఏదో రకంగా అధికరాంలోకి వస్తే 2019 సార్వత్రిక ఎన్నికల వరకు జనతాదళ్‌ను కాంగ్రెస్ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. మరో రకంగా జనతాదళ్ ఇప్పుడు కాంగ్రెస్ ఆడించినట్లుగా ఆడాల్సిందే. గత పాలనకు సంబందించి సిద్దరామయ్య పాపాల జోలికి పోయే అవకాశం లేదు. ఇదిలావుంచితే కర్నాటక వ్యవహారంతో కమ్యూనిస్టులు సహా ఇతర ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వెనక నిలబడ్డాయి. అనూహ్యంగా అంతా కదలివచ్చారు. మమతా బెనర్జీ లాంటి వారు గట్టిగానే మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ విజయమని ప్రకటించారు. చంద్రబాబు, కెసిఆర్‌లు కూడా కర్నాటక వ్యవహారాలతో మళ్లీ ప్రాంతీయ పార్టీల బలోపేతంపై మాట్లాడారు. దేశంలో ఏదెలా ఉన్నా మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపితో కన్నా రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్‌తో వేగడం ఈజీ అని అన్ని ప్రాంతీయ పార్టీలకు తెలుసు. అందుకే కర్నాటక రాజకీయాలతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రబిందువుగా మార్పులు తథ్యమని తెలుస్తోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీ అరాచకాలు పెచ్చరిల్లినప్పుడు ప్రత్యామ్నాయం ఏర్పడుతుందన్న భరోసాను మాత్రం మిగిల్చాయి. ఇప్పుడు కర్ణాటక రాజకీయాలతో పాటు గత నాలుగేళ్లుగా మోడీ నిరంకుశ విధానాలతో విసిగిపోయిన పార్టీలన్నీ ఏకమవ్వ డానికి అవకాశం ఏర్పడింది. కెసిఆర్ కూడా ఇదే తరహాలో ఆలోచన చేసినా, ఆయన ప్రయోగం అందరికీ నచ్చినా, కాంగ్రెస్ లేకుండా పార్టీలన్నీ ఏకం ఇప్పట్లో సాధ్యం అయ్యేఏలా కనిపించడం లేదు. ప్రత్యామ్నా య ఫ్రంట్ ఏర్పడాలని, ఎవరికి వారు తామే దానికి నాయకత్వం వహించాలని ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు చాలామంది ఆశగా ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ ఇల ఎందరో ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక పరిణామం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుకుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని అంతగా ఇష్టపడని మమతా బెనర్జీ గత రెండు మూడురోజుల్లో సోనియాగాంధీతో సహా పలువురు ప్రాంతీయ పార్టీల నాయకుల కు ఫోన్లు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకోలేని స్థితిలో ఉన్న ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుతో కూడా ఆమె సంప్రదింపులు జరిపారు. చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జేడీఎస్ నేత కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాల జోలికి వెళ్లకూడదనుకున్న చంద్రబాబునాయుడు కర్ణాటక పరిణామాల తర్వాత మళ్లీ చురకుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎపి ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే భవిష్యత్‌లో అనివార్యంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్‌లో జట్టు కట్టిన అఖిలేశ్ యాదవ్, మాయావతితో చేయి కలపాలని కాంగ్రెస్ పార్టీ సూతప్రాయంగా నిర్ణయించింది. బిహార్‌లో రాష్టీయ్ర జనతాదళ్ ఇప్పటికే కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా
కాంగ్రెస్ కూటమిలో చేరడానికి వెనకాడరని తాజా పరిస్థితులు తెలియచేస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే పార్టీ ఇదివరకే కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా ఉంటోంది. మహారాష్ట్రలో ఎన్‌సీపీ నేత శరద్‌పవార్ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో సాగడానికి సిద్దంగా ఉన్నారు. మారిన పరిస్థితుల్లో శివసేన కూడా కూటమిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్టపికే ఆ పార్టీ బిజెపితో విభేదించి ఎన్‌డికు రామ్‌రామ్ చెప్పింది. ఈ మధ్య రాహుల్‌కు మద్దతుగా మాట్లాడుతోంది. మొత్తానికి కర్ణాటక పుణ్యమా అని బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ అరాచకాలకు బలైన పార్టీలన్నీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలో జట్టు కట్టబోతున్నాయి. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్.టి.రామారావు చొరవతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు గవర్నర్ల వ్యవస్థను తరచుగా దుర్వినియోగం చేసేది. ఫలితంగా బాధిత పక్షాలన్నీ నేషనల్ ఫ్రంట్ పేరిట ఒక్కటయ్యాయి. జనతా పార్టీ తరహాలోనే నేషనల్ ఫ్రంట్ కూడా అధికారంలోకి వచ్చింది. దురదృష్టవశాత్తూ నాయకుల పదవీకాంక్ష వల్ల ఈ రెండు ప్రయోగాలు ఎంతోకాలం నిలువలేదు. కానీ ప్రస్తుత తాజా రాజకయీఆలు, కర్నాటక పరిణమాలు కాంగ్రెస్‌కు కలసి వస్తున్నాయనే చెప్పాలి. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు ప్రాంతీయ పార్టీలు సిద్దంగా ఉన్నట్లు అర్తం అవుతోంది. జెడిఎస్ చేరడమే ఇందుకు నిదర్శనం. మోడీపై వ్యతిరేకత వీరందరిని కూటమి కట్టేలా చేయడం ఇక్కడ గమనించాలి.