కాంగ్రెస్‌కు మరింత చేరువగా టిడిపి

కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. ఇటీవలి వరుస ఘటనలు లేదా సందర్భాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎన్‌డిఎ నుంచి బయటపడ్డాక టిడిపి రానున్న రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్క రించిందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా కర్నాటకతో మొదలయిన బాబు ప్రస్థానం ఇప్పుడు పార్లమెంటు దాకా సాగింది. తాజాగా అవిశ్వాసంతో కాంగ్రెస్‌కు చేరువయ్యింది. అలాగే రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికలో మరింత స్పష్ట కనబర్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థికి టిడిపి బేషరతుగా మద్దతు ఇచ్చింది. అయితే ఇక్కడ భంగపాటు అన్నది వేరే విషయం. ఇదంతా ఎందుకు జరుగుతోందన్న విషయాలను లోతుగా ఆలోచనచేయాలి. ఎపికి ప్రధాని మోడీ అన్యాయం చేశారని ప్రచంలోకి దిగిన చంద్రబాబు తన లక్ష్యాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఎపిలో బిజెపిని దానికి కొమ్ము కాస్తున్నాయని అనుకుంటున్న, వైకాపాను,జనసేనను ఒకే దెబ్బతో కొట్టాలి. అలాగే ఉమ్మడి హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయేలా చేసి,ఓటుకు నోటు కేసులో ఇరికించిన కెసిఆర్‌ను కూడా దెబ్బకొట్టాలి. అందుకే కాంగ్రెస్‌కు దగ్గర కావడం, దాని కూటమిలో చేరడం ద్వారా ఈ రెండు లక్ష్యాలను సాధించాలన్నది బాబు ఎత్తుగడ కావచ్చు. ఇకపోతే రాఫెల్‌ ఒప్పందంపై ఆందోళనకు పార్లమెంట్‌ గేటు బయటకు వచ్చిన ఎఐసిసి పూర్వ అధ్యక్షురాలు సోనియాతో అక్కడే ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపిలు పరుగెత్తుకుని వెళ్లి పలకరించారు. దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోక పోయినా అందరికీ కనిపించిన దృశ్యం. అవిశ్వాస తీర్మానం సందర్బంగా కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారానే ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోరాడేందుకు నిర్ణయం జరిగినట్లుగా అర్థం అవుతోంది. ఎపిలో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌,టిడిపిలు కలసి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బిజెపితో వైకాపా కలసిపోయిందని అంటున్న బాబు నాలుగేళ్లుగా బిజెపితో అంటకాగిందెవరో చెప్పడం లేదు. నిజానికి కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ టిడిపి ఇప్పుడు అధికారం తిరిగి దక్కించుకునే క్రమంలో కాంగ్రెస్‌తో జతకట్టేందుకు వెనకాడడం లేదు. ఆంద్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని బిజెపి విమర్శలు చేస్తున్నా పెద్దగా పట్టించుకునే స్థాయిలో లేదు. రాజ్యసభ ఉపాద్యక్షుడి ఎన్నికలలో కాంగ్రెస్‌కు టిడిపి మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని బిజెపి రాజకీయం కోసం అంటున్నా, అసలు విషయం మాత్రం కాంగ్రెస్‌ కూటమిలో టిడిపి చేరడం ఖాయమని చెప్పకనే చెప్పవచ్చు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని చెబుతున్న సీఎం చంద్రబాబు..కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందో చెప్పాల్సి ఉంది. విభజనతో ఎపికి కాంగ్రెస్‌ తీరని అన్యాయం చేసిందంటున్న బాబు ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో ప్రజలకు వివరించేందుకు ప్రిపేర్‌ అవుతున్నారు. తనపై బిజెపి చేస్తున్న అవినీతి ఆరోపణలను ప్రధానంగా దృష్టి మళ్లించడంతో పాటు, తెలంగాణలో ఓటుకునోటు కేసును పక్కదోవ పట్టించడం, కేసిఆర్‌ పై కక్ష తీర్చుకోవడం అన్న లక్ష్యాలను ప్రధానంగా పెట్టుకున్నారని అర్థం అవుతోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్‌ టీడీపీని స్థాపించినా, ఎన్టీఆర్‌నే పడగొట్టి తొడగొట్టిన నాయకుడు చంద్రాబు నాయుడు. తిమ్మినిబమ్మిని చేసే ఇంద్రజాలం తెలిసిన వాడు. అయితే బిజెపి ముందు ముఖ్యంగా మోడీ ముందు ప్పులు ఉడకక పోవడంతో ఇప్పుడు యూ టర్న్‌ తీసుకోక తప్పలేదు. అందుకే కాంగ్రెస్‌ వ్యతిరేకి అయినా ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపడం చూస్తుంటే బాబు రాజకీయ వ్యూహాలను పసిగట్టవచ్చు. తను కోరుకున్న విధంగా మోడీ నడుచుకోక పోవడం, తనను అప్రతిష్టపాలు చేసిన కెసిఆర్‌ లక్ష్యంగా ఇప్పుడు బాబురాజకీయాలు నెరపుతున్నారు. ఇకపోతే బాబు అనుకున్నట్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగెలిచివుంటే వ్యవహారం మరో రకంగా ఉండేది. బిజెపి చాణక్యం, కాంగ్రెస్‌ అలసత్వం కారణంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో జెడియుకు చెందిన ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్‌ విజయం సాధించగలిగారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రతిపక్షాల ఐక్యతకు చిహ్నంగా ప్రచారం జరగడంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఇటీవలి కాలంలో ఐక్యతారాగం ఆలపిస్తుండటంతో రాజ్యసభలో బలం తక్కువ ఉన్న ఎన్డీఏ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ సొంత పార్టీకి చెందిన వ్యక్తిని అభ్యర్ధిగా నిలబెడితే కొన్ని పార్టీల మద్దతు సాధించడం అసాధ్యమని భావించిన బిజెపి అధినేతలు వ్యూహాత్మకంగా జెడియుకి చెందిన హరివంశ్‌ను ఎన్డీఏ అభ్యర్ధిగా ప్రకటించి, చకచకా పావులు కదిపారు. దీంతో బిజూజనతాదళ్‌ (9), టిఆర్‌ఎస్‌ (6) ఓట్లు పొందడం సాధ్యమైంది. అలాగే, శివసేన, అకాళీదళ్‌లను దారికి తెచ్చుకోగలిగింది. ఆయా పార్టీల నాయకులతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడి అనుకున్నది సాధించ గలిగారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం పూర్తిగా విఫలమయ్యింది. తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న ఆమ్‌ ఆద్మీ, పిడిపిల ఓట్లు పొందలేక పోయింది. నిజానికి రాజ్యసభలో ఎన్డీఏకి తన అభ్యర్ధిని గెలిపించుకునేంత బలం లేదు. కేవలం కాంగ్రెస్‌ అధినాయత్వం అలసత్వం కారణంగానే విజయం సాధించగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ తన సొంత అభ్యర్ధి హరి ప్రసాద్‌ను రంగంలోకి దింపినపుడే దాని అపజయం ఖరారయ్యింది. కర్ణాటకలో ప్రదర్శించిన రాజకీయ పరిణతిని రాజ్యసభ ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ ప్రదర్శించలేక పోయింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని ఓడించాలంటే తాము ఒక్కటవ్వక తప్పదని ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు భావిస్తున్నాయి. ఈ పరిణామం కాంగ్రెస్‌కు గొప్పవరం. ఈ దిశగా టిడిపి కూడా కలసి రావడం దానికి కలసి వచ్చే అంశంగా చూడాలి. అయితే టిడిపి లక్ష్యం మాత్రం వేరుగా ఉంది. మోడీని,కెసిఆర్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చేస్తున్న విన్యాసాలు, వ్యూహాలు ఏ మేరకుకలసి వస్తాయో చూడాలి.