కాంగ్రెస్,టిడిపిలకు ఓటు అడిగే హక్కులేదు
టిఆర్ఎస్ నాలుగేళ్లలో హావిూలను నెరవేర్చింది
పట్టణ ప్రచారంలో జోగురామన్న
ఆదిలాబాద్,నవంబర్3(జనంసాక్షి): గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేసిందన్నారు. నాలుగేండ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నాలుగేండ్లలో చే సిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఉచిత హావిూలు ఎన్నో ఇస్తున్నారని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రా ష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లే దని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజలు కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పని చేశారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయంటే కేసీఆర్ సమర్థతే కారణమన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3016 నగదును అందించేందుకు టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించిందన్నారు. 90 శాతం ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా జోనల్ వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.