కాంగ్రెస్‌తో పొత్తు వార్తలపై స్పందించాలి

టిడిపి తెలంగాణ నేతలు విమర్శలు మాని నిజాలు చెప్పాలి: వినయ్‌ భాస్కర్‌

వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇప్పటికే దీనిపై ఊహాగానాలున్నాయని అవి నిజం కావడంకోసం బాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న తెలంగాణ టిడిపి నేతలు ముందుగా దీనిపై సమాధానం ఇవ్వాలని అన్నారు. ఇది నిజమాకాదా చెప్పాలన్నారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేకాదని ఇటీవలి ఘటనలే నిదర్శనమని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తాడూబొంగరం లేకుండా పోయిన నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తుకు వెంపర్లాడుతోందన్నారు. కొంత వరకూ తెలుగుదేశం పార్టీకి సహకారం అందించేలాగా, ఏపీలో తాడూబొంగరం లేని కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు సహకారం అందించేలా ఒప్పందం కుదిరినట్టుగా కనిపిస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీల బలందక్కితే.. దానిద్వారా కాంగ్రెస్‌ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించడం కోసం బాబు యత్నాలు చేస్తున్నారని అన్నారు.అందుకే కాంగ్రెస్‌తో ఖాయంగా పొత్తును పెట్టుకునే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే ఎపికి చెందిన వైకాపా నయాకులు కూడా ఇదే తరహా విమర్శలుచేస్తున్నారు. ఎలాగూ చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు భయం. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్‌ తప్ప చంద్రబాబుకు మరోదిక్కు కూడా కనిపించడంలేదు. ఈ సవిూకరణాలను బట్టిచూస్తే టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల పొత్తు ఖాయమనే అనుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే మిగిలిపోయిన కొంతమంది నేతలు… రేపటి ఎన్నికల్లో పార్టీ తరఫున రంగంలోకి దిగడానికి అయితే సై అంటున్నారు. కానీ వీళ్లకు విజయం విూద ఎలాంటి విశ్వాసంలేదు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కలిసివస్తే కాలం కలిసొస్తుంది అనేది వీళ్ల లెక్కగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అనుకూలంగా లేని నియోజకవర్గాల్లో రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు పోటీచేసే అవకాశాలున్నాయని, ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు పొత్తులో కేటాయించేందుకు చంద్రబాబుకు కూడా పెద్దగా అభ్యంతరం లేదనే టాక్‌ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలను, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి అంత అనుకూలంగా ఉండని నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ ఖాతాకు ఇవ్వనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కర్నూలు, రాజంపేట ఎంపీ సీట్లను చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు కేటాయించే అవకాశాలున్నాయని సమాచారం. కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, రాజంపేటలో కిరణ్‌ కుమార్‌రెడ్డిలు పోటీ చేయనున్నారు. వీటిల్లో రాజంపేట సీటుపై టీడీపీకి ఎలాంటి ఆశలులేవు. కర్నూల్లో కూడా టీడీపీ పరిస్థితి ఏమంత గొప్పగాలేదు. ఇక కోట్ల, కిరణ్‌లు ఎంతో కొంతమేర ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. ప్రత్యేకించి వైసీపీకి సాలిడ్‌ ఓటు బ్యాంకు, సంప్రదాయ ఓటు బ్యాంకును వీళ్లు ప్రభావితం చేయగలరనే అంచనాలున్నాయి.