కాంగ్రెస్‌లో కష్టపడే నేతలకు గుర్తింపు లేదు
– ఢిల్లీలో లాబీయింగ్ చేసేవారికే పదవులు
– ఢిల్లీ లాబీయింగ్ పద్దతికి స్వప్తి పలకాలి
– కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, జనవరి18(జనంసాక్షి) : కాంగ్రెస్‌లో కష్టపడే నాయకులకు గుర్తింపు లేదని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్న నాయకులకు న్యాయం జరగడం లేదని అన్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. సీఎల్పీ ఎంపికను కూడా ఢిల్లీ చేయటమంటే సరికాదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి, సమర్థవంతమైన నేతలకు సీఎల్పీ పదవి అప్పగించాలని, అలా కాకుండా ఢిల్లీ లాబీయింగ్ ద్వారా సీఎల్పీ ఎన్నిక జరిగితే కాంగ్రెస్‌కు నష్టమని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇకనైనా ఢిల్లీలో లాబీయింగ్ సిస్టమ్‌కు స్వస్తిపలకాలన్నారు. తెలంగాణలో జరిగే పరిణామాలు రాహుల్‌కు తెలియవని అన్నారు. కేసులు, ఆర్థిక ఇబ్బందులతో గత్యంతరం లేకనే ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పార్టీ మారారని అన్నారు. కాంగ్రెస్‌లోని బలహీన నేతలు టీఆర్‌ఎస్‌కు ఆకర్షితులు అవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలంటే క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగైతేనే రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబడుతుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ బలాన్ని నిరూపించుకొనే అవకాశం ఉంటుందన్నారు. అన్నీ ఢిల్లీ నుంచే జరగాలంటే రాష్ట్రంలో పరిస్థితులు తెలియని నేతలు వారి చుట్టూ తిరిగే వారికి పెత్తనం ఇస్తున్నారని, దాని వల్ల పార్టీ కూడా నష్టపోతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితికి స్వస్తిపలికి సమర్థమైన నేతలను పట్టంకట్టాలని జగ్గారెడ్డి కోరారు.