కాంగ్రెస్‌లో ముదరుతున్న వర్గపోరు
ఖమ్మం, అక్టోబర్ 19 : సత్తుపల్లిలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ సమావేశ మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి వేదిక అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు గత నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. గత నెల రోజులుగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ… ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం విదితమే. ఈ క్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి సరిగా లేదంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ పార్టీ గురించి పట్టించుకోవడం లేదంటూ తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టు సిఎం కలిసి వచ్చిన తరువాత రేణుక వర్గీయులు కొందరు ప్రకటించారు. దీనికి సంబాని వర్గీయులు కూడా దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ పరిణామం కాంగ్రెస్‌లో సంబాని, రేణుకా వర్గీయుల మధ్య విభేదాలకు ఆద్యం పోసినట్టయింది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు గాను సత్తుపల్లిలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు రేణుకా అన్నారు. ఈ మేరకు ఈ నెల 21న సత్తుపల్లిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ బాధ్యులు ప్రకటించారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి, డిప్యూటీ స్పీకర్, ఇన్‌ఛార్జీ మంత్రి, రేణుకా చౌదరి సమావేశానికి హాజరవుతారని చెప్పారు.