కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు

1

టీపీసీసీ చీఫ్‌ఉత్తవమ్‌ కుమార్‌

హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి)

గాంధీభవన్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల సమ్మేళనం ముగిసింది. సమావేశానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఎన్‌ఎస్‌యూఐ, యువజన కార్యకర్తలకు మరింత గుర్తింపునివ్వనున్నట్లు తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చాక యువజనులకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కార్యకర్తలు ఎలాంటి త్యాగాలకైన సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని ఉత్తమ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ను పీల్చి పిప్పిచేసినవారు పార్టీని వీడి వెళ్లిపోతున్నారన్నారు. ప్రతిపక్షాలు, మీడియాను అణిచివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామన్నారు, వూరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ కలిపి నిరుద్యోగ గర్జన చేపట్టాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలపాత్ర పోషించిన వారికి భవిష్యత్‌లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఇచ్చిందో… వాటిని తెరాస విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎండగట్టాలని భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.