కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరమ్మబాట
ప్రజలకు ఒరిగిందేమీ లేదు
టిడిపి నేత ఎర్రన్నాయుడు
శ్రీకాకుళం, జూలై 30 : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి మూడు రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మబాటలో జిల్లా ప్రజలకు ఒనగూరిందేమీ లేదని కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు ఆరోపించారు. ఎక్కడ సమస్యలు అక్కడే వదిలి, సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వకుండా అపార ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సాధించింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. వంశధార రెండో దశ పనులు ఆగిపోగా, నాగావళి నది కరకట్టలకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. రిమ్స్ నిర్మాణ పనులు నాణ్యత లేవని, ఆప్‌షోర్ నత్తనడకన నడుస్తోందని, వంశధార నిర్వాసితులకు ప్యాకేజి అమలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇన్ని ప్రధాన సమస్యలు పెట్టుకుని వాటిని అధిగమించడానికి స్పష్టమైన హామీలు ఇవ్వని ఇందిరమ్మబాట ప్రజల కోసం కాదని, కాంగ్రెస్ కార్యకర్తల కోసమేనని విమర్శించారు. అణు, థర్మల్ విద్యుత్తు వ్యతిరేక పోరాటాలు, కన్నెధార కొండ లీజు రద్దు లాంటి ఆందోళనలు ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా తెలుసుకోవాల్సిన తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కనీసం రెండు గంటలు ప్రతిపక్షాలకు అవకాశమిచ్చి సమస్యలను తెలుసుకొని అభివృద్ధికి కృషి చేయాలని ఆయనకు ఎర్రన్నాయుడు హితవుపలికారు.