కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ అనుభవిస్తున్నాడు: రేవంత్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో నాగార్జున, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, బీమా, శ్రీరాంసాగర్‌ కట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని కొందరు అడుగుతున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ కాదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ  కాంగ్రెస్‌ ఇచ్చింది కాబట్టే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలను కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. సోనియాను అమ్మానా.. బొమ్మనా అని తిట్టిన కేసీఆర్‌ని చూస్తూ ఊరుకుందామా?, కదం తొక్కి ఖతం చేద్దామా? అని రేవంత్‌ ఉద్వేగంగా ప్రసంగించారు. కండలు కరగని, గుండెలు పగలని, రక్తం ఏరులై పారని పోరాడదామా? గెలిపిద్దామా?. అంటూ ప్రజలకు రేవంత్‌ పిలుపునిచ్చారు.