కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
– కేసీఆర్ మోడీ ఏజెంట్
– మోడీతో లాలూచి పడే ముందస్తుకెళ్లాడు
– 20న రాహుల్‌గాంధీ బహిరంగ సభను విజయవంతంచేయండి
– విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నిర్మల్, అక్టోబర్15(జనంసాక్షి) : డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఉత్తమ్ నిర్మల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ముథోల్ నియోజక వర్గం బైంసాలో ఈనెల 20న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. బైంసా నుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభజనం సృష్టించబోతుందన్నారు. ముథోల్ నియోజక వర్గంలో 2014 లో గెలిసిన కాంగ్రెస్ నేతను టీఆర్ఎస్ దొంగ దారిలో కొనుక్కుంది అని ఆయన విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకొని ప్రభుత్వం టీఆర్ఎస్ అని మండిపడ్డారు. కేసీఆర్ నయా దొంగ అని, కేసీఆర్ మోడీ ఏజెంట్ అని అన్నారు. కేసీఆర్ డోకే భాజ్, అబద్దాల కోరు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోడితో లాలూచి పడే ముందస్తు ఎన్నికలకు పోయారు. కేసీఆర్ కు ఓటేస్తే మోడికి వేసినట్టే. మైనర్టీలను మోసం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఈ నెల 20న జరిగే రాహుల్ గాందీ సభను విజయవంతం చేయండని కోరారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్తి రైతులను రాజులను చేస్తామని ఉత్తమ్ తెలిపారు. బైంసాలో పసుపు పంట అభివృద్దికి కృషి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.