.కాంగ్రెస్ వల్లే కొవిడ్ వ్యాప్తి పెరిగిందట!
` ప్రధాని మోదీ వింత వ్యాఖ్యలు
దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): దేశంలో కొవిడ్ తొలిదశలో వైరస్ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కరోనా ప్రారంభ దశలో కాంగ్రెస్ అన్ని పరిధులూ దాటిందనీ.. కొవిడ్ వైరస్ దేశమంతా వ్యాపించడానికి, వలసకూలీల సంక్షోభానికి ఆ పార్టీ నేతలే కారణమయ్యారంటూ ధ్వజమెత్తారు. దేశంలో జరుగుతున్న పలు ఎన్నికల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్ నేతలకు అహంకారం మాత్రం తగ్గడంలేదని అన్నారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని.. కాంగ్రెస్ సహా పలు విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్‌లో మార్పు రావడంలేదన్నారు. ఒడిశా, గోవా, నాగాలాండ్ ప్రజలు 25 ఏళ్ల క్రితమే కాంగ్రెస్‌ను వెళ్లగొట్టారన్న మోదీ.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ ప్రజలూ ఆ పార్టీని తిరస్కరించారన్నారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. కాంగ్రెస్‌పై మాటల తూటాలు పేల్చారు.రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను ఎలా పోషించగలదో ఆలోచించేందుకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సరైన సమయమని మోదీ అన్నారు. కరోనా కాలం తర్వాత ప్రపంచం కొత్త క్రమంలో, కొత్త వ్యవస్థల వైపు వేగంగా కదులుతోందన్న ప్రధాని.. ఇది మనకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదన్నారు. కరోనా తర్వాత భారత్ ప్రపంచంలో మంచి గుర్తింపు సాధించుకుందనీ.. ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందన్నారు. రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్న ప్రధాని.. రక్షణ రంగంలో పెండిరగ్ సమస్యల్ని పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ అనేది స్టేటస్ సింబల్‌గా ఉండేది.. కానీ ఇప్పుడు అత్యంత పేదవాళ్లకు కూడా అందుబాటులోకి రావడం సంతోషదాయమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి రావడం, డీబీటీ వంటి సేవలు వంటి కీలక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పేదల ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ వచ్చి.. పొగలు కక్కే పొయ్యి నుంచి విముక్తి లభిస్తే ఆ ఆనందం మరోలా ఉంటుందన్నారు. దేశం స్వాతంత్య్రం సాధించాక ఇన్నాళ్లకు పేదలకు గ్యాస్ కనెక్షన్లు, ఇళ్లు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకొచ్చామనీ.. అందరికీ సొంత బ్యాంకు ఖాతాలూ ఉన్నాయన్నారు. కానీ దురదృష్టవశాత్తు విపక్ష నేతల ఆలోచనలు ఇంకా 2014లోనే చిక్కుకుపోయాయంటూ ధ్వజమెత్తారు. కరోనా సమయంలో కాంగ్రెస్ పరిధి దాటి ప్రవర్తించిందని మోదీ మండిపడ్డారు. కరోనా తొలి దశలో డబ్ల్యూహెచ్‌వో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలన్న సూచనతో మేం లాక్‌డౌన్ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతలు ముంబయి రైల్వేస్టేషన్‌లో వలసకూలీలకు ఉచితంగా రైలు టిక్కెట్లు ఇచ్చి కొవిడ్ వ్యాప్తికి కారణమయ్యారంటూ విరుచుకుపడ్డారు. వలస కూలీలనూ కష్టాల్లోకి నెట్టారంటూ దిల్లీ సహా పలు భాజపాయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వేలెత్తిచూపారు. దిల్లీలోని ప్రభుత్వం మురికివాడల్లోకి మైక్‌లతో వెళ్లి.. వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేస్తాం.. వెళ్లిపోవాలని సూచించిందన్నారు. ఇలాంటి చర్యలతో యూపీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని మోదీ ఆక్షేపించారు.కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. కానీ కొందరు రాజకీయ ప్రయోజనాలకోసం ఆ పరిస్థితులను దుర్వినియోగం చేశారన్నారు. కొవిడ్‌తో మోదీ ఇమేజ్‌కి నష్టం జరుగుతుందని కొందరు ఆలోచించారని ఆరోపించారు. ‘‘నేను.. వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడితే దాన్ని పట్టించుకోరు. భారత్ స్వయం సమృద్ధి దేశంగా అవతరించాల్సిన అవసరంలేదా? గాంధీజీ కలలు సాకారం కావడం విూకు ఇష్టంలేదా?’ అని కాంగ్రెస్‌ని ప్రధాని నిలదీశారు.‘‘విూరు (కాంగ్రెస్) నన్ను వ్యతిరేకించండి.. కానీ ఫిట్ ఇండియా ఉద్యమం, ఇతర పథకాలను ఎందుకు విమర్శిస్తారు? యోగా గురించి ఎవరు గర్వపడరు? దాన్నీ ఎగతాళి చేశారు. కొన్నేళ్లుగా అనేక రాష్ట్రాల్లో విూరు అధికారానికి దూరం కావడంలో ఆశ్చర్యమేవిూ లేదు.. అసలు మరో వందేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఆలోచన కూడా విూకు లేదని నేను భావిస్తున్నాను’’ అన్నారు.‘‘కరోనా సమయంలో దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరాదని 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ పంపిణీ చేశాం. ఈరోజు భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థ. మన మొత్తం ఎగుమతులు అధికంగా ఉన్నాయి. అదికూడా కొవిడ్ కాలంలో.’’ అని చెప్పారు.‘‘కరోనా సమయంలో చిన్న రైతుల్ని కష్టాలనుంచి గట్టెక్కించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. చిన్న రైతులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వారిపై దృష్టి పెట్టాం. చిన్న రైతుల బాధలు తెలియనివారికి వారిపేరిట రాజకీయాలు చేసే హక్కులేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కొందరు వ్యక్తులు తమబానిస మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు. జీవితాంతం రాజభవనాల్లో ఉండేవారికి రైతుల కష్టాలేం తెలుస్తాయి?’’ అని విమర్శించారు.‘‘ప్రతిపక్షాలకు ఫైల్స్ ముఖ్యం.. కానీ మాకు దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ముఖ్యం. కొవిడ్ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోంది. మన దేశ రైతులు రికార్డు స్థాయి పరిమాణంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారు. వీధి వ్యాపారులు తొలిసారి బ్యాంకు రుణాలు పొందారు. డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. 2014లో 500 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 60వేలకు చేరింది. పారిశ్రామికవేత్తలు కరోనా వేరియంట్‌లు అని మాట్లాడే వ్యక్తులు కాంగ్రెస్‌లో ఉన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని వ్యక్తులు చరిత్రకు దూరమవుతారు’’ అన్నారు.‘‘మన దేశ యువత, సంపద సృష్టికర్తలు, పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధానాన్ని మేం అంగీకరించం. మేకిన్ ఇండియాపై కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి. అవినీతికి చోటులేదనే మేకిన్ ఇండియాపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’పై ఎవరైనా సలహాలు ఇవ్వొచ్చు.. కానీ అది విఫలమవుతుందని చెప్పడం ఎలాంటి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది? మేకిన్ ఇండియాని ఎగతాళి చేసిన వారే జోక్‌గా మారిపోయారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ ఇప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్‌కు నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్ విధానమే గతంలో బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించి పాలించడం’. ప్రజాస్వామ్యయుతంగా మమ్మల్ని అడ్డుకోలేకే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారు.. కానీ మమ్మల్ని అడ్డుకోలేరు. కాంగ్రెస్ పార్టీ తమిళ ప్రజల సెంటిమెంట్‌ను గాయపరిచే ప్రయత్నం చేసింది. దేశాన్ని విడగొట్టి పాలించడం వారి డీఎన్‌ఏలోనే ఉంది. సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందిన సమయంలో రోడ్ల వెంబడి నిలబడి నివాళులర్పించిన తమిళనాడు పౌరులకు సెల్యూట్ చేస్తున్నా’’ అన్నారు.