కాంగ్రెస్ వల్లే గల్ఫ్‌కు వలసలు
– ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెస్‌ను నమ్మకండి
– టీఆర్‌ఎస్ హయాంలోనే గల్ఫ్ బాధితులకు న్యాయం
– నాలుగేళ్లలో వారి సంక్షేమం కోసం రూ.106కోట్లు కేటాయించాం
– విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత
నిజామాబాద్,నవంబర్10(జనంసాక్షి): తెలంగాణ బిడ్డలు గల్ఫ్‌కు వలసలు వెళ్లడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు దుబాయ్ వెళ్లి గల్ఫ్‌లోని తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని చెబుతుండటం విడ్డూరంగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామబాద్‌లో ఆమె
డిప్యూటి సిఎం మహ్మూద్ అలీతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కాంగ్రెస్ నేతల గల్ఫ్ యాత్రపై స్పందిస్తూ… కాంగ్రెస్ హయంలో 2006 నుంచి 2011వరకు నయా పైసా లేకుండా ఎన్నారై సెల్
నడిపిందని మండిపడ్డారు. 2012 నుంచి 2014 వరకు గల్ఫ్ సంక్షేమం కోసం ఇచ్చింది కేవలం రూ. 6కోట్లు మాత్రమే నని అన్నారు. అదే టీఆర్‌ఎస్ హయంలో 2014 నుంచి 2018 వరకు రూ. 106 కోట్లు కేటాయించామని కవిత పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో 1,278 మంది గల్ఫ్ లో చనిపోయిన తెలంగాణ బిడ్డలను ఒక్క పైస ఖర్చు లేకుండా స్వదేశానికి తీసుకువచ్చామని కవిత తెలిపారు. అదే కాంగ్రెస్ 10ఏళ్ల పాలనలో గల్ఫ్ లో చనిపోయిన వారిని తీసుకువచ్చింది వేళ్లవిూద లెక్క పెట్టవచ్చు అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయంలోనూ గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలను కూడా టీఆర్‌ఎస్ పార్టీ చొరవ చూపించి వారిని ఆదుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఎవరు విూకు అండగా నిలిచారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కవిత సూచించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు కవిత విజప్తి చేశారు. 67 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల్ని అడుగడుగునా మభ్యపెట్టి కాంగ్రెస్, టీడీపీ నేతలు బతికారన్నారు. ప్రభుత్వ చర్యలతో వలసలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. సొంత గ్రామాల్లోనే ఉపాధి చర్యలు తీసుకున్నట్లు కవిత వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ గల్ఫ్‌లోని తెలంగాణ బిడ్డలంతా తెరాసకే అండగా నిలుస్తారని అన్నారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంతో కృషి చేశారని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు.ఆనాడు దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, అప్పటి నుంచి తెలంగాణలో కష్టాలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. ముస్లింల విద్య కోసం 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. గురుకులాల ద్వారా అత్యున్నత విద్యను అందిస్తున్నామని తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని హావిూలను కూడా కెసిఆర్ అమలు చేశారని పొగిడారు. ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందేలా కెసిఆర్ పథకాలను ప్రవేశపెట్టారని ప్రశంసించారు. మహాకూటమి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని ఎద్దేవా చేశారు. షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డల పెళ్లికి లక్షా 116 ఇస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐల కోసం సిఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, దేశంలో అత్యుత్తమ సిఎం కెసిఆర్ అని అలీ కొనియాడారు.