కాంగ్రెస్‌ వైపు మెహబూబా చూపు

1

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): దివంగత జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబూబా చూపు కాంగ్రెస్‌పై పార్టీ వైపు ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చినా.. సర్కారు ఏర్పాటు గురించి మాత్రం ఆమె ఏవిూ చెప్పలేదు.  జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ భావించిన మెహబూబా ముఫ్తీ.. ఇంకా సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని ఎటూ తేల్చకుండా ఇంకా నానుస్తూనే ఉన్నారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, అందువల్ల తన కుమార్తెను సీఎం చేస్తే బాగుంటుందని దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ గతంలోనే అన్నారు. ఆయన మాటను మెహబూబా కొట్టి పారేసే పరిస్థితి లేదు గానీ.. తండ్రి మరణించిన తర్వాత తక్కువ కాలంలోనే పదవి చేపట్టడంపైనే ఆమెకు అభ్యంతరాలున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు.. కేంద్రం నుంచి కశ్మీర్‌కు రావల్సిన ప్యాకేజి విషయంలో తమ పార్టీ వ్యవహరించిన తీరుపై కూడా ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం మరో పది రోజుల వరకు పట్టేలా ఉంది. ప్రభుత్వ ఏర్పాటు విషయం పక్కన పెట్టి.. తొలుత నియోజకవర్గాలకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలకు ఆమె సూచించారు. సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ శుక్రవారం నాడు మరణించడంతో.. అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌ రాష్ట్రం.. రాష్ట్రపతి పాలనలోనే కొనసాగుతోంది. వారం రోజులు సంతాపదినాలు ఉన్నాయి. అవి ముగిసేవరకు సీఎం పదవి చేపట్టడం గురించి మాట్లాడొద్దని మెహబూబా ముఫ్తీ స్పష్టంగా చెబుతున్నారు.