కాంగ్రెస్‌ హవాలా బాజ్‌

5
ప్రధాని మోదీ ఎదురు దాడి

భోపాల్‌,సెప్టెంబర్‌10(జనంసాక్షి):

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను హవాలా బాజ్‌ గా అభివర్ణించారు.  మంగళవారం సోనియా గాంధీ మోదీపై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యంగా వర్షాకాల సమావేశా లను సజావుగా సాగనీయకపోవడంపై మోదీ మండి పడ్డారు. మధ్యప్రదేశ్‌ రాజధాని  భోపాల్‌లో గురువారం ప్రధాని మాట్లడుతూ  కాంగ్రెస్‌ పార్టీ హవాలాబాజ్‌ (అవినీతి పార్టీ) అని, దేశాభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆయన ఆరోపించారు. బ్లాక్‌ మనీపై పార్లమెంటులో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలపై కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుట్టిందని, అందుకే సమావేశాలను అడుగడుగునా అడ్డుకున్నారని మోదీ విమర్శించారు. ఎన్నికల ఓటమిని కాంగ్రెస్‌ పార్టీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందని మోదీ ఆరోపించారు. దేశ ప్రజలు ఏ ఆశయంతో తమను గెలిపించారో వాటిని నేరవేర్చుతామని మోదీ అన్నారు. ప్రజలచే ఓటమికి గురైన వారు ఇప్పటికైనా దేశాభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. 1984 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, అయినా తమ పార్టీ ఎవరినీ నిందించలేదని, ఆ ఓటమి నుంచి పార్టీ ఎంతో నేర్చుకుందన్నారు. ఒకప్పుడు పార్లమెంటులో బీజేపీ నుంచి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ బీజేపీ పట్ల ఎగతాళి చేసినా తాము సహించామన్నారు. ఒకప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్‌కు 400 స్థానాలకుపైగా బలముంటే నేడు ఆ సంఖ్య 40కి పడిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు.ఇది ఇలా ఉండగా ప్రజల్లోకి వెళ్లేందుకు హిందీ భాష ఎంతో ఉపయోగపడిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హిందీని పదికాలాల పాటు బతికించుకోవాలని అన్నారు. ప్రపంచ 10వ హిందీ మహాసభలు మధ్యప్రదేశ్‌ రాజధాని  భోపాల్‌లో గురువారం  ప్రారంభమయ్యాయి. ఈ సదస్సు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరైయ్యారు. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రపంచ హిందీ సదస్సు కుంభమేళా లాంటిదన్నారు.  నా మాతృభాష గుజరాతీ. నేను రైల్వేస్టేషన్లో చాయ్‌ అమ్మేటప్పుడు హిందీ నేర్చుకున్నా. ప్రజల్లోకి వెళ్లేందుకు హిందీ భాష ఎంతో ఉపయోగపడింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో హిందీ నేర్చుకుంటున్నారు. వారసత్వ సంపదలను కాపాడుకోవడం వాటిని భవిష్యత్‌ తరాలకు అందించడం మనందరి బాధ్యత. హిందీ భాషను రక్షించుకోవడం మన ధర్మమని ఆయన పేర్కొన్నారు. గాంధృ, సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి ఎందరో నేతలు హిందీయేతరులే అయినా హిందీ ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆదరించారన్నారు. అనేకమంది నేతలు హిందీ ప్రాముఖ్యాన్ని గుర్తించి దానిని ముందుకు తీసుకుని వెల్లారన్నారు. ఈ కార్యక్రమంలో సుస్మాస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.