కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తరు..!!
` అభూత కల్పనలు, మాయమాటలతో మోసగిస్తారు.. జాగ్రత్త
` పర్యాటకుల్లా వచ్చిపోయేవారికి తగిన బుద్ధి చెప్పాలి
` రేవంత్‌రెడ్డివి అహంకారపూరిత మాటలు
` ఎవరికి ఓటేస్తే తెలంగాణ బాగుపడ్తదో ఆలోచించండి
` ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన
వరంగల్ ప్రతినిధి/దమ్మపేట/అశ్వరావుపేట (జనంసాక్షి):కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఏజెంట్లు వస్తారని, అభూత కల్పనలు, మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తరని, అందుకే ఆలోచించి ఓటువేయాలని సూచించారు. ఇప్పుడిప్పుడే రైతుల అప్పులు తేరుతున్నాయని, రైతుల మొఖాల్లో వర్చస్సు వస్తున్నదని, ఇది పోగొట్టుకోకూడదని చెప్పారు. తెలంగాణ తెచ్చినవాడిగా.. నాయకుడిగా.. విూ బిడ్డగా విూ అందరికీ మనవి చేసేది ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలని, ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మీ అందరి దీవెనలు ఉంటే రాష్ట్రాన్ని ఇదేబాటలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. రైతుల పట్ల సానుభూతి లేని పార్టీని ధరణి తీసేస్తామని చెబుతోందని, అలాంటి పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు. నర్సంపేట పట్టణం లోని సర్వాపురం సమీపంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా సీఎం చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. గతంలో కరువు భారిన పడి, మంచినీళ్లు, కరెంటు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ఓట్ల కోసం ఆశ చూపి గద్దెనెక్కాలని చూసేవాళ్ళకు గుణపాఠం చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి దీవించి రైతుబంధు దళిత బంధు ఆసరా పెన్షన్లు పెంచుకొని ప్రజా రంజక పాలన కొనసాగడానికి ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించిన ఘనత పాలక ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులను మోసం చేయాలని చూస్తున్నారని, జాగ్రత్త ఉండాలని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పర్యటకు లాగా వచ్చి పోయేవారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ ప్రాంతం వాసియుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాకాల, గోదావరి, జలాలను తీసుకువచ్చి రైతులకు కాళ్లు కడిగాడని, అందుకే టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
వజ్రం తునకలా పాత ఖమ్మం
గోదావరి వరద ముంపున బారినపడకుండా రూ.వెయ్యికోట్లతో కరకట్టలను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బూర్గంపాడులో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’సీతారామ ప్రాజెక్టు విూ కండ్ల ముందే జరుగుతున్నది. సీతమ్మ సాగర్ 37 టీఎంసీల నీటి కెపాసిటీతో ఉంటది. గోదావరి నుంచి మన ఇష్టమునన్ని నీళ్లు తీసుకోవచ్చు. పాత ఖమ్మం జిల్లాను వజ్రం తునకలా పాత ఖమ్మం తయారవుతుంది. ఏ పార్టీ వైఖరి ఏంటి.. ఎవరి నీతి ఏంది? ఎవరిని నిలబెడితే ప్రజలం నిలుబడుతాం అని ఆలోచన చేయాలి. భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగులపై ఇబ్బందులుండేవి. గర్భిణులు ప్రసవమైతే.. మంచంలో పెట్టుకొని మైళ్లకొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది’ అన్నారు. గతంలో వరదలు వచ్చినయ్. భద్రాచాలం నేను వచ్చాను.. పరిశీలన చేశాం. 14వేల కుటుంబాలకు ఇంటికి రూ.10వేల చొప్పున ఇచ్చాం. ఎవరైనా నష్టపోయే వారికి ఇండ్లు కట్టించాం. గోదావరి కరకట్టలు రూ.వెయ్యికోట్లతో కట్టాలని రిపోర్ట్ వచ్చింది. నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వరద నివారణకు చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే భద్రాద్రి సీతారాములను దర్శించుకొని.. ఒక పూట భద్రాచలంలో, మరొకచోట ఉంటాను. విూ మధ్యనే ఉండి రాష్ట్ర అధికారుల బృందాన్ని తీసుకొని వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రెండు నియోజకవర్గాల్లోని దళితులకు దళితుబంధు ఒకేసారి ఇప్పిస్తా’నన్నారు. ధరణి పోర్టల్‌తో రైతుల భూములను ఎవరూ గోల్‌మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రేవంత్‌రెడ్డి అహంకారానికి హద్దులే లేవు : సీఎం కేసీఆర్
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అహంకారానికి హద్దులే లేవని.. ఆయనేం పడగొడుతడో తెల్వదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఇవాళ కాంగ్రెస్ బాధ్యతా రహిత్యంగా మాట్లాడుతున్నది. ఇదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు అందరూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. వాళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదు. వస్తే వేస్తరనుకుందాం. వేస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. గతంలో ప్రభుత్వంలో రూపాయి సాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది? ఎంతమంది పైరవీకారులు ఉండేది ? ఈ రోజుల అట్ల లేదు’ అన్నారు. ‘పీసీసీ అధ్యక్షుడు ఒకటి రెండు, మూడు, నాలుగుసార్లు చెబుతున్నడు. ఆయన అహంకారానికి హద్దులే లేవు. ఆయన ఏం పడగొడుతడో.. ఏం చేస్తడో నాకు తెల్వది కానీ.. ఆయనకు ఉన్న అవగాహన ఏంటో నాకు తెల్వదు. ఆయనకు తెలివి ఏంటో తెలియదు. నేను కూడా రైతునే. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. రైతుబంధు కావాలంటే మెచ్చ నాగేశ్వర్‌రావు గెలవాలి’ అని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికతోనే కథ ఆగిపోదు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే.. హైదరాబాద్‌లో ఆ పార్టీ గర్నమెంట్ ఏర్పడుతుంది. పైన ఏ గవర్నమెంట్ రావాల్నో.. ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే మనకు లాభమైతదని వివరించారు.మళ్లీ రాష్ట్రాన్ని ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకెళ్లేందుకు నాగేశ్వర్‌రావుకు, బీఆర్‌ఎస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నా’నన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత ఎంపీ. నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ బండి పార్థసారధి రెడ్డి, ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.