కాంగ్రెస్‌ గ్యారెంటీలపై తొలి సంతకం

. మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ చేతి గుర్తుకు ఓటేయాలి
. 2023 ఎన్నికల సమరభేరి వికారాబాద్‌ నుంచి మొదలైంది
. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
వికారాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెడతమన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని గ్యారంటీ కార్డుకు పూజ చేసి ఓటు వేయండని పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్‌ లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ‘‘మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ చేతి గుర్తుకు ఓటేయాలి. డిసెంబర్‌ 9, 2023 ఉదయం 10.30కి ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ తొలి సంతకం. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం… డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు తరలిరండి’’ అని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 2023 ఎన్నికల సమరభేరి వికారాబాద్‌ గడ్డపై నుంచి మొదలైందన్నారు రేవంత్‌ రెడ్డి. వికారాబాద్‌ జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు గెలిపించాలి అని ప్రజలను కోరారు. కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి ప్రచారం మొదలు పెడితే.. నేను వికారాబాద్‌ గడ్డపై నుంచి ప్రచారం మొదలు పెడుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కు హుస్నాబాద్‌ కలిసొతుందట… నాకు వికారాబాద్‌ కలిసొ స్తుంది.. ఎవరికేది కలిసొస్తుంది అనేది
డిసెంబర్‌ 3న తెలుస్తుందని రేవంత్‌ రెడ్డి అన్నారు.
2018 ఎన్నికలలో జరిగిన తప్పిదం మళ్లీ జరగొద్దనే ఉద్దేశంతో చంద్ర శేఖర్‌ గారిని ఒప్పించి వారికి జహీరాబాద్‌ టికెట్‌ ఇవ్వడం జరిగింది. వికారాబాద్‌ లో ప్రసాద్‌ గారిని, జహీరాబాద్‌ లో చంద్రశేఖర్‌ గారిని, పరిగిలో రామ్మోహన్‌ రెడ్డి గెలిపించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
తాండూరులో కాంగ్రెస్‌ గెలవాలని మనోహర్‌ రెడ్డిగారిని పార్టీలో చేర్చుకున్నామన్నారు. చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్‌ ది. అలాంటి చేవెళ్ల గడ్డ పై భీం భరత్‌ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలి అని రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా రైతుల కల నెరవేరలేదని రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత చేవెళ్లతో ఈ ప్రాంత రైతాంగం కష్టాలు తీర్చాలని కాంగ్రెస్‌ భావించింది. ప్రాజెక్టు పడావుబడటానికి కేసీఆర్‌ కారణం కాదా? ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి బీఆరెస్‌ కారణం కాదా? పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కేసీఆర్‌ కారణం కాదా? అని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఆడబిడ్డ సునీతమ్మను నడి బజారులో అవమానించిన సంస్కృతి ఇక్కడి ఎమ్మెల్యేది. గతంలో ఇలాంటి సంస్కృతి ఇక్కడ ఉండేదా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ మీటింగులకు జనమే కరువయ్యారు. నిఖార్సైన కార్యకర్తలు ఇక్కడ ఉంటే…. కేసీఆర్‌ మీటింగుల్లో కిరాయి మనుషులు ఉన్నారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే.. టీవీ9 లో కూర్చుని డ్రామారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని కేటీఆర్‌ పై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.