కాంగ్రెస్‌ వస్తే ధరణి ఎత్తేస్తారు

మళ్లీ కౌలు రైతులు, వీఆర్‌ఓల బెడద

. ‘గులాబీ’ని మళ్లీ గెలిపిస్తే పాత పథకాలు అమలు.. కొత్తవి ఆచరణ
. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్‌ తెచ్చాం
. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ చేస్తాం
. భువనగిరిలో కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది
. జనగామ, భువనగిరి సభల్లో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు
ఓటు మన తలరాతను మార్చేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎంతో బలమైన ఆయుధం మన ఓటు. ఓటును ఎలా వేస్తామో.. మన కర్మ అలానే ఉంటుంది. మంచి, చెడు గుర్తించి ప్రజలు ఓటేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు.
` సీఎం కేసీఆర్‌
జనగామ బ్యూరో/ప్రతినిధి, భువనగిరి (జనంసాక్షి) :
కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ తమ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పాత పథకాలు కొనసాగిస్తూనే.. కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్‌ తెచ్చామని తెలిపారు. ఈ క్రమంలోనే గతంలో రైతుల భూమిపై దశల వారీగా 10 మంది అధికారులకు పెత్తనం ఉండేదన్న సీఎం.. ధరణి తెచ్చి అందరి పెత్తనం తీసేశామని స్పష్టం చేశారు. భూమిపై రైతులకే అధికారం ఇచ్చామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే కౌలు రైతులు, వీఆర్‌వోల బెడద మళ్లీ వస్తుందని చెప్పారు. ఆదివారం జనగామ, భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.
రానున్న ఎన్నికల్లో జనగామ భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామన్నారు. జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీతో పాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామ న్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే ఏడుపొచ్చేదని, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే బాధనిపించేదని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపం లో ఉన్నందున భవిష్యత్‌లో జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయన్నారు. ‘’భవిష్యత్‌లో ఐటీ, పారిశ్రామికంగా జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే ఊరిలో ఒక్క యువకుడు కనిపించలేదు. ఊరిలో యువకులంతా పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లారని తెలిసింది. ఇప్పుడు బచ్చన్నపేటలో 365 రోజులు నీళ్లు ఉంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మనది అగమ్య గోచర పరిస్థితి. ఆర్థిక నిపుణులను పిలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించా. ఎంతో మేథోమధనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాం. ఇవాళ తెలంగాణ నుంచి 2 నెలలపాటు వేలాది లారీల్లో ధాన్యం పంట తరలివెళ్తోంది. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే దారినపడ్డారు. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణి తెచ్చాం. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి రెవెన్యూ అధికారుల అధికారాలను రైతు చేతిలో పెట్టాను. రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరు’’ అని కేసీఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయి. రైతుల మీద అధికారులను మళ్లీ రుద్దాలని విపక్షాలు చూస్తున్నాయి. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి. భారాస మళ్లీ గెలిస్తే.. 93 లక్షల మందికి కేసీఆర్‌ బీమా అమలు చేస్తాం. రైతుబీమా తరహాలోనే వ్యక్తి చనిపోతే వారంలోనే రూ.5 లక్షలు వస్తాయి. మళ్లీ గెలవగానే రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం.’’ అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.
పెట్టుబడులు వస్తున్నాయ్‌..
రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. ‘మతకలహాలు లేకుండా శాంతిభద్రతలు బాగున్నాయి. కొందరు వచ్చి మతం పేరుతో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. తెలంగాణలో హిందూ, ముస్లింల మధ్య సోదరభావం ఉంది. గణేశ్‌ నిమజ్జనం రోజే మిలాద్‌ ఉన్‌ నబీ వస్తే.. ఎవరూ అడగకుండానే ముస్లిం మత పెద్దలు ఆ వేడుకను ఒక రోజు వాయిదా వేసుకున్నారు’ అని కేసీఆర్‌ అన్నారు. ఓట్ల కోసం మేం అబద్ధాల మేనిఫెస్టో పెట్టలేదని కేసీఆర్‌ అన్నారు. దేశంలో దళితబంధు పెట్టాలనే ఆలోచన ఏ సీఎంకు అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. దేశంలో దశాబ్దాల క్రితమే దళితబంధు పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జెడ్పీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీజిల్లా అధ్యక్షులు పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్సీలు బొడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు బండ యాదగిరి రెడ్డి, సేవెళ్లి సంతప్‌, మేకపోతుల ఆంజనేయులు, కందుకూరి ప్రభాకర్‌, తాళ్ల సురేష్‌రెడ్డి, బొల్లం శారద, సర్పంచ్‌ వడ్లకొండ రాకేష్‌ రెడ్డి, గజ్జి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో నాడు కరువు.. నేడు పుష్కలం : కేసీఆర్‌
ఒకప్పుడు కరువు ప్రాంతమైన భువనగిరిలో ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. భువననిగిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాకుండా ఉంటే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. భువనగిరిలో ఐటీ హబ్‌ తీసుకురావాలని కేటీఆర్‌కు చెప్పా. భారాస మళ్లీ గెలిస్తే భువనగిరలో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాలకు మేలు చేసేలా భారాస మేనిఫెస్టో రూపొందించాం. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తాం. మీరు భారాసని మరోసారి గెలిపించండి. 24 గంటల పాటు కరెంటును అలాగే కొనసాగించుకుందాం. బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’’ అని కేసీఆర్‌ తెలిపారు. ‘లక్ష ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నరసింహ సాగర్‌ జలాశయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. తిరిగి అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. భువనగిరిని అద్భుతంగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డిని మరోసారి గెలిపించాలి’ అని కేసీఆర్‌ కోరారు.