కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
వెట్టిచాకిరి ఇంకెన్నాళ్లు : కోదండరాం
బస్ భవన్ ఎదుట టీఎంయూ ఆందోళన
హైదరాబాద్, జూలై 18 :బుధవారం నాడు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి బస్సు భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడు తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని వెట్టి చాకిరి ఇంకెంత కాలం అని అన్నారు చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న తెలంగాణ కాంట్రాక్టు కార్మికుల సర్విసులను క్రమబద్దీకరించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, తెలంగాణ జేఏసి ఛైర్మన్ కోదండరామ్ వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తే ఆర్టీసీ సంస్థపై అధనపు భారం పడుతుందని సంస్థ ఎం.డి ఎ.కె.ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 21వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అదనపు భారం సంస్థపై పడుతుందని ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీల్లో విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 2002 సంవత్సరం నుంచి చనిపోయిన కార్మికుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన అన్నారు. కార్మికులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని దానిని కూడా దృష్టిలో ఉంచుకొని డబల్ డ్యూటి చేసిన కార్మికులకు అదనపు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులను, కార్మికులను వేధిస్తే సహించేంది లేదని యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీలో వివిధ కేటగిరి ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామని ఆయన అన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.