కాకినాడ కార్పొరేషన్‌లో బదిలీలు
కాకినాడ, జూలై 30,: నకిలీ సర్టిఫికేట్లతో కాకినాడ ఇంజనీరింగ్ విభాగంలో ఎఇగా పనిచేస్తున్న సుబ్బారావు అనే వ్యక్తి ఎట్టకేలకు విజయవాడ బదిలీ అయ్యారు. అదే విధంగా కాంట్రాక్టర్ శ్రీనివాస్, ప్రభాకర్ ఎఇలుగా పనిచేస్తున్నారు. వీరు కూడా కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టారు. వీరిద్దరూ ఇంజనీరింగ్ విభాగంలో ఒకరిపై ఒకరు నిత్యం ఆరోపణలు చేసుకుంటూ ఇంజనీరింగ్ విభాగం అంటేనే ఏకభావం కలిగేలా ప్రవర్తించారు. ఎట్టకేలకు వీరిలో సుబ్బారావుకు విజయవాడ, ప్రభాకర్‌కు కొవ్వూరుకు బదిలీపై వెళ్లారు. అదే విధంగా ఇంజనీరింగ్‌లో ఎంఇగా పనిచేస్తున్న సత్యకుమారి రాజమండ్రికి బదిలీ అయ్యారు. సత్యకుమారి తండ్రి ఇదే కార్పొరేషన్‌లో పనిచేశారు. తండ్రికి ఉన్న పరపతిని ఉపయోగించుకుని నామినేషన్ వర్కులలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ చేశారని ప్రధాన ఆరోపణలు ప్రధాన పత్రికల్లో వచ్చాయి. ఈమెను రాజమండ్రి కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు తాజాగా కాకినాడ కార్పొరేషన్‌కు ఇద్దరు ఎంఇలకు పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో ఒకరు విశాఖపట్నం నుంచి, మరొకరు విజయవాడ నుంచి వచ్చారు. అదే విధంగా ఇంజనీరింగ్ శాఖలో కృష్ణమూర్తి అనే ఎలక్ట్రికల్ ఎఇ కూడా లాంగ్ స్టాండింగ్‌పై బదిలీ అయ్యారు. టౌన్‌ప్లానింగ్‌లో టిపిఎస్‌గా పనిచేస్తున్న నాగశాస్త్రి సామర్లకోటకు బదిలీపై వెళ్లగా, మరో టిపిఎస్ సుబ్రహ్మణ్యం పదోన్నతిపై మండపేట బదిలీ అయ్యారు. కాకినాడ కమీషనర్‌గా రవికుమార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ అందరి అభిమానాన్ని సంపాదించారు. ఈయన హయాంలో లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులకు స్థాన భ్రంశం చెందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.