కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ప్రారంభం
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ప్రారంభం
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించగా.. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయాణికులకు అభివాదం తెలిపారు. తొలిరోజు వివిధ పాఠశాలల విద్యార్థులు, జర్నలిస్టులు, రైల్వే టెక్నికల్ అధికారులు, సిబ్బంది, ఇతర రైల్వే అధికారులు ప్రయాణం చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్, డోన్, హిందూపురం, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్‌లో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.తిరుగు ప్రయాణం యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11-15 నిమిషాలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభమవుతున్న వందేభారత్ రైలు వల్ల ఐటీ రంగానికి రాజధానులైన హైదరాబాద్-బెంగళూరు స్టేషన్ల మధ్య వేగవంతమైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ బాలాజీ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, డాక్టర్ గౌతంరావు, కార్పొరేటర్లు ఉమా రమేశ్‌యాదవ్, అమృతతో పాటు వివిధ శాఖల రైల్వే అధికారులు పాల్గొన్నారు.