కామారెడ్డిని దేశం గమనిస్తోంది

` తెలంగాణ దశదిశను మార్చే తీర్పు ఇవ్వాలి
` భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ
` అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్‌రెడ్డి
` టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
కామారెడ్డి,నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును కామారెడ్డి ప్రజలు ఇవ్వాలని.. ఇక్కడి తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం మాటలు నమ్మి మోసపోవద్దని.. గొప్ప తీర్పును ఇవ్వాలని కోరారు. కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్‌ చేసింది ఏమీ లేదని విమర్శించారు. వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేసిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా హస్తం పార్టీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో రేవంత్‌ పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రేవంత్‌ పేర్కొన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఓటుకు రూ.పది వేలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్న రేవంత్‌.. ఆదమరచి కేసీఆర్‌కు ఓటు వేస్తే రూ.కోట్ల విలువైన భూములను కొల్లగొడతాడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్‌ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి ప్రజలు గొప్ప తీర్పును ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే 10 సభల్లో పాల్గొనగా.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 23 సభల్లో, ప్రియాంక గాంధీ 26 సభల్లో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి 55 సభలకు హాజరు కాగా.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ 10 సభల్లో పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 3 సభల్లో, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ 4 సభల్లో పాల్గొని ప్రచారం చేశారు.
అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.తెలంగాణకు చెందిన కార్మికులకు ఇతర దేశాల్లో అన్యాయం జరిగితే న్యాయం చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.’’రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అవకాశమిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ, నేను తీసుకుంటాం. కేసీఆర్‌ ఇచ్చే రూ.10వేలకు ఆశపడి ఓటు వేయొద్దు. ఆయన గెలిస్తే కామారెడ్డిలో రూ.వేలకోట్ల విలువైన భూములు కబ్జా చేస్తారు. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలి? ఐదేళ్లుగా రుణమాఫీ చేయని వాళ్లను ఎందుకు గెలిపించాలి? తెలంగాణ దశ, దిశను మార్చే తీర్పును కామారెడ్డి ప్రజలు ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి కోరారు.