కారు డ్రైవర్‌కు ఊహించని అనుభవం
న్యూఢల్లీి, సెప్టెంబర్ 22 (జనం సాక్షి): తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడి బ్యాంకు అకౌంట్లో రూ.వేలు, రూ.లక్షలు కాదు ఏకంగా రూ.వేల కోట్లు జమయ్యాయి. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పళనికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దెకు కారు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి రూ.9,000 కోట్లు తన బ్యాంకు ఖాతాలోకి జమైనట్లు ఉంది. దీంతో ఒక్కసారిగా రాజ్‌కుమార్ షాక్ అయ్యాడు. అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు ఆ ఖాతా నుంచి తన స్నేహితుడికి రూ.21వేలు పంపాడు. దీంతో తన ఖాతాలో ఇంత మొత్తం ఉన్నది నిజమేనని నిర్ధారణకు వచ్చాడు. తన బ్యాంకు ఖాతాలో ఊహించని విధంగా రూ.9 వేల కోట్లు జమకావడంతో సంబరపడ్డాడు. అయితే రాజ్‌కుమార్‌కు ఆ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంది. కొద్దిసేపటికే పొరపాటును గుర్తించిన సదరు బ్యాంకు రాజ్‌కుమార్ ఖాతా నుంచి పూర్తి డబ్బును తిరిగి (డెబిట్) తీసేసుకుంది. అంతేకాకుండా తన స్నేహితుడికి పంపిన రూ.21వేల నగదును కూడా తిరిగి చెల్లించాలని బ్యాంకు యాజమన్యం సూచించింది. రాజ్‌కుమార్ తరఫున న్యాయవాదులు చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు వెళ్లి మాట్లాడారు. దీంతో రాజ్‌కుమార్ తన స్నేహితుడికి పంపిన రూ.21వేలు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం. ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. వేల కోట్లు జమకావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.