కారు భీభత్సం
– అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన నిర్మాత సురేష్‌బాబు కారు
– ఇద్దరికి తీవ్ర గాయాలు
– కార్కానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
– స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిన సురేష్‌బాబు
హైదరాబాద్, అక్టోబర్22(జనంసాక్షి) : టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పేరిట రిజిస్టర్ అయివున్న కారు (టీఎస్ 09 ఈఎక్స్ 2628) అదుపుతప్పి సోమవారం తెల్లవారు జామున బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ సవిూపంలోని కార్కానా పరిధిలో స్వయంగా సురేష్ బాబు డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు వేగంగా రావడంతో అదుపుతప్పి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సురేష్‌బాబే స్థానికుల సహాయంతో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల చిన్నారి సిద్ధేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సిద్ధేష్ తండ్రి సురేష్ చంద్రకు వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపాయి. సురేష్ చంద్ర కాలు విరిగిందని వైద్యులు తెలిపారు. ఆయన భార్య దుర్గాదేవికి స్వల్పగాయాలు కాగా, చికిత్స తరువాత డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయంటే, కారు ఎంత వేగంతో ప్రయాణిస్తూ, ప్రమాదానికి కారణమైందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 337 కింద సురేష్ బాబుపై పోలీసులు కేసును నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ, సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా
కారును పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించి సురేష్‌బాబు, వ్యక్తిగత పూచీకత్తుపై వెళ్లారని కార్కానా
పోలీసులు వెల్లడించారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని, సాయంత్రం తిరిగి విచారణకు రావాలని కోరామని తెలిపారు. ఇదిలా ఉంటే దగ్గుబాటి మద్యం తాగి వాహనం నడిపారా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు చేయిస్తామని పోలీసులు తెలిపారు.