కార్గిల్‌యుద్ధం చేసినందుకు గర్విస్తున్నాం

దేశ ప్రజలను కాపాడేందుకే స్వదేశం వచ్చా
పర్వేజ్‌ ముషారఫ్‌
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
కార్గిల్‌ యుద్ధం చేసినందుకు గర్విస్తున్నామని పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ స్థానిక జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల ఆత్మగౌరవం కోసమే భారత్‌తో యుద్ధానికి దిగామని తెలిపారు. ఆయుధ పోరులో ఓడినా దౌత్యపరంగా విజయం సాధించామన్నారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడే తాను పగ్గాలు చేజిక్కించుకున్నానని తెలిపారు. ప్రజల భద్రతే తనకు ముఖ్యమని అన్నారు. ఇప్పుడు ప్రజల భద్రత ప్రమాదంలో పడిందన్నారు. అందుకే ప్రజల రక్షణ కోసం తాను స్వదేశానికి తిరిగివచ్చానని తెలిపారు. త్వరలో జరగబోయే  పాకిస్థాన్‌ జాతీయ పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ పడుతుందని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేసే రాజకీయ పక్షాలు తాము ప్రజల కోసం ఏం చేశామో చెప్పాలని డిమాండ్‌ చేశారు.