కార్తీక పౌర్ణమి సిక్కులకు ప్రత్యేకం
గురునానక్ జయంతి సందర్బంగా ప్రత్యేక పూజలు
చండీఘడ్,నవంబర్30 (జనం సాక్షి): అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తిక పౌర్ణమి.అంతటి పరమ పవిత్రమైన కార్తిక పౌర్ణమి రోజున, సిక్కు ధర్మ స్థాపకుడు గురు నానక్ జన్మించాడు. ఆయన కారణజన్ముడు. ఆచారాలను వ్యతిరేకించి, కుల మత రహిత సమసమాజ నిర్మాణానికి
ఉపక్రమించాడు. మన దేశంలోని పలు ప్రాంతాలను దర్శించి పలువురిలో అంధ విశ్వాసాలను మూఢాచారాలను మాన్పగలిగాడు. టిబెట్, చైనా, సిలోను, మక్కా, మదీనాలను దర్శించి భగవంతుడి ఏకత్వాన్ని ప్రచారం చేశాడు. ఆయన కృషిని, తొమ్మిదిమంది సద్గురువులు కొనసాగించారు. వారందరినీ సిక్కులు గురు నానక్ తదుపరి అవతారాలుగా, ఆత్మజ్యోతులుగా భావిస్తారు. దశావతారాలతో పోల్చదగిన విధంగా, గురు నానక్‌తో కలిపి పదిమంది సిక్కు గురువులు ఆధ్యాత్మిక ప్రపంచానికి దిక్సూచులుగా వర్ధిల్లారు. ప్రస్తుతం ‘గురు గ్రంథ సాహెబ్’ గురువుగా పూజలందుకుంటోంది. ‘నేను హిందువునో, ముసల్మానునో చూడటం లేదు. కేవలం మనిషిని చూస్తున్నాను’ అనేవారు నానక్. జననం ముందు, మరణించాక మనిషి ఆత్మ స్వరూపుడే! దేహాన్ని దహిస్తారు. అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. పంచభూతాల్లో కలిసిపోతుంది. అందువల్ల, శరీర భ్రాంతి నుంచి అతడు బయటపడాలి. కుల మతాలకు అతీతమైన ఆత్మగానే ప్రాణుల్ని చూడాలి. రూపానికి ఎలాంటి ప్రాధాన్యమూ లేదనడమే శివుడి నిరాకారత్వం. గురు నానక్ బోధనల సారాంశమూ అదే. మనిషికి ఉన్నది కేవలం ఆత్మే. మరొకటి లేదు. అది గ్రహించడమే జ్ఞానం!