కార్తీ ఆస్తులు జప్తు 

– రూ.54కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ
న్యూఢిల్లీ, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) భారత్‌, యూకే, స్పెయిన్‌లలో కార్తికి చెందిన రూ.54కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఐఎన్‌ఎక్స్‌ విూడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతులు ఇప్పించడం కోసం అవినీతికి పాల్పడ్డారని కార్తిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో చిదంబరం యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టం ద్వారా కార్తి చిదంబరానికి చెందిన తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్‌లో ఉన్న ఆస్తులను, దిల్లీలోని జోర్‌భాగ్‌ ప్రాంతంలోని ఫ్లాట్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. యూకేలోని సోమర్‌సెట్‌ కౌంటీలో ఉన్న ఇల్లు, కాటేజీ, స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న టెన్నిస్‌ క్లబ్‌ను అధికారులు సీజ్‌ చేశారు. చెన్నైలోని బ్యాంకులో ఉన్న రూ.90లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. కార్తి చిదంబరం, ఆయనతో సంబంధం ఉన్న అడ్వాన్స్‌డ్‌ స్టాట్రజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏఎస్‌సీపీఎల్‌) పేరున ఈ ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.54కోట్లు ఉంటుందని ఈడీ పేర్కొంది.