కార్పొరేట్లకు కోట్ల రుణమాఫీ

4

రైతుల అప్పుల మాఫీపై ఎందుకు మీమాంస !

ఆత్మహత్యల పరిహారం రూ.5 లక్షలకు పెంచండి

రౌండ్‌ టేబుల్‌లో కోదండరామ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):

ఆత్మహత్యలకు పాల్పడొద్దు: కోదండరాం

ప్రభుత్వం కార్పోరేట్‌ కంపెనీలకు వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తోందని… రైరు రుణాలను విస్మరించడం బాధాకరమన్నారు. పంట నష్టానికి పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటన చేయాలని… అప్పుడే రైతు ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని తెలంగాణ రాజకీయ ఐకాసచైర్మన్‌ కోదండరాం సూచించారు. రైతు ఆత్మహత్మలను వక్రీకరించే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణాలన్నింటినీ బ్యాంకులు ప్రభుత్వ ఖాతాల్లోకి మార్చాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల కారణాలపై తెలంగాణ జాగృతి సంస్థ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ రాజకీయ ఐకాసచైర్మన్‌ కోదండరామ్‌, ఎంపీ కవిత, పలువురు వ్యవసాయ రంగ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. దశాబ్దకాలంగా కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలకు ఇప్పటికీ అడ్డుకట్ట వేయలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. వర్షాభావ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడి వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను సాగుచేస్తున్న రైతులే అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వంతో పాటు వ్యవసాయ, రెవిన్యూ, పోలీసు శాఖలు రైతుల ఆత్మహత్యలను వక్రీకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకుంటాం: కవిత

రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఎంపీ కవిత కోరారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.8వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని… ఇంకా రూ.4వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయాల్సి ఉందని తెలిపారు. కొన్ని బ్యాంకులు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నాయని… త్వరలోనే ఆ బ్యాంకులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. కొత్త రుణాలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇప్పిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జాగృతి దత్తత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులు సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాకారమవుతుందని వ్యాఖ్యానించారు.