కార్పోరేటర్‌ తనయుడి అరెస్ట్‌

 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): మద్యం మత్తులో యువకులపై దాడి చేసిన ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ తనయుడు దొడ్ల రామకృష్ణగౌడ్‌తో పాటు మరో ముగ్గురిని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈనెల 4వ తేదీ రాత్రి భాగ్యనగర్‌ కాలనీలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద మియాపూర్‌కు చెందిన హేమంత్‌వర్మ, మరో నలుగురు యువకులకు రామకృష్ణగౌడ్‌తో వివాదం జరిగింది. రామకృష్ణగౌడ్‌, అతడి సహచరులు కలిసి హేమంత్‌వర్మ అతడి స్నేహితులపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా రామకృష్ణగౌడ్‌, అతడి సహచరులు సేవత్తి నర్సింహాచారి, అర్రోజు చాణిక్య, పోకలోళ్ల శివకుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.