కార్పోరేట్ స్థాయికి ప్రభుత్వ వైద్యం
డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు పేదలకు వరం
ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామన్న మంత్రి
హైదరాబాద్,ఏప్రిల్18(జనంసాక్షి): పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ఏర్పడ్డ తరవాత మాత్రమే సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో సాధ్యమయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామని, నిధులు కేటాయించి వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గతంలో ఉన్న ఆస్పత్రులకు ఇప్పుడున్న ఆస్పత్రులకు తేడా గమనించాలని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రయోజనాల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, తమ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనతను చాటుకున్నట్లు తెలిపారు. కిడ్నీవ్యాధిగ్రస్తుతలకు ఇదో పెద్ద వరమన్నారు. అవసరాన్ని బట్టి కేంద్రాలు ఏర్పాటు చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు ఆర్ధిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయని, దీంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు. డయాలసిస్ ఫిల్టర్ ఒక సారి వినియోగించిన తదుపరి తిరిగి ఉపయోగించడానికి అవకాశం లేదని గతంలో ప్రైవేట్ వైద్యశాలల్లో డయాలసిస్ కోసం ఫిల్టర్లను చాలా సార్లు వినియోగించే వారని, పలు సార్లు ఉపయోగించడం వల్ల వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందేవి కావని అన్నారు.
కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి ఒక్కసారి డయాలసిస్ చేయించుకుంటే దాదాపు రూ.3వేల వరకు ఖర్చు అయ్యేదని, దాని వల్ల పేద ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేదని, వారి ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల వ్యాధిగ్రస్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. సరిహద్దున ఉన్న చత్తీస్‌గడ్, ఒరిస్సా, ఆంధప్రదేశ్ తదితర రాష్టాల్ర నుంచి సైతం ప్రజలు ఆరోగ్య సేవల కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తారని అన్నారు. వారికి కూడా ఈ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభ్వుతం అధికారంలోకి వచ్చిన తదుపరి పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ విధమైన వైద్యసేవలు అందుతాయో అధేస్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల్లో అందజేయుటకు చర్యలు తీసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో పత్రీ ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.