కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్ష బుధవారం నాడు రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు దండి వెంకట్‌ మాట్లాడుతూ, మున్సిపల్‌లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని ఆయన అన్నారు. అదే విధంగా కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన కోరారు. కాంట్రాక్టు పద్దతి కార్మికులకే అందిస్తే వారు గ్రూపుగా ఏర్పడి వారి పనులను నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్దతి ఇవ్వడం వల్ల రెండున్నర శాతం కాంట్రాక్టర్లకే కమీషన్‌ రూపం వెళ్లడంతో మున్సిపల్‌ నిధులకు గండిపడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కనీస వేతనం వారికి పదివేల రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులను అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బని లత, చంద్రసింహ, విజయలక్ష్మి, భూపతి, యాదగిరి, శ్రీశైలం, రాజారాం, సంతోష్‌సింగ్‌ కార్మికులు పాల్గొన్నారు.

తాజావార్తలు