కాలాన్ని బట్టి మారుతున్న రాజకీయ అవసరాలు
రాజకీయ వాతావరణం వేడెక్కడంతో ఆయారామ్ గయారామ్‌లు తెరపైకి వచ్చారు. స్వార్థం వారి లక్ష్యం. పార్టీల్లో సిద్దాంతాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. కేవలం స్వార్థం కోస తమకు పదవులు దక్కాలన్న ఆశతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దూకడం ఎన్నికల ముందు సహజసిద్ద పరిణమాంగా చూడాలి. అలాగే ఆయా పార్టీలు జతకట్టడం కూడా అంతే అవసరాలకు అనగుణంగా ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో జజతకడుతుందో చెప్పలేం. దీనిని తప్పుగా చూడలేం. కాంగ్రెస్,టిడిపిలు ఇప్పుడు జతకడితే అది కాలంలో వచ్చిన మార్పుగానే చూడాలి. ఎందుకంటే టిడిపిని వ్యతిరేకించిన టిఆర్‌ఎస్ కూడా గతంలో దానితోనే మహాకూటమి కట్టింది. ఇకపోతే పార్టీల్లోకి అటువారు ఇటు..ఇటువారు అటు వెళ్లడం కూడా సహజపరిణామం గానే చూడాలి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి కొండ్రు మురళి టిడిపిలో చేరారు. మాజీమంత్రి డికె సమరసింహారెడ్డి అటుతిరిగి ఇటు తిరిగి చివరకు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కొండా సురేఖ దంపతులు మళ్లీ కాంగ్రెస్‌లోకి చేరాలనుకుంటున్నారు. ఎన్నికల నాటికి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో సిద్దాంతాలు లోపించాయి. అధికారమే అన్ని పార్టీల పరమావధి అని చెప్పకతప్పదు. నీతులు మాట్లాడే వారిని నమ్మవద్దు. ఎన్నికయ్యాక కూడా నిర్లజ్జగా పార్టీలు మారుతున్నారు. రాత్రికి రాత్రే గోడదూకుతున్నారు. అయితే నైతిక విలువలు లోపించాయనడానికి ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఈ దశలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తప్పు పట్టడానికి లేదు. ఎవరి అవసరాలు వారివి. రాజకీయాల్లో విలువలు లేవని సరిపెట్టు కోవాలి. విలువలు అంటే ఏమిటన్న ప్రశ్న వెంటనే ఉత్పన్నం అవుతుంది. వేటిని విలువలు అంటారు? అలాగే నైతికత గురించి కూడా ఇటీవల బాగా మాట్లాడుతున్నారు. నైతిక విలువలు అన్నవి రాజకీయ పార్టీలకు వర్తించవన్న విషయం క్రమంగా రూఢీ అవుతోంది. పార్టీలన్న తరవాత రాజకీయాలు చేయాలి తప్ప నైతిక విలువలు పాటిస్తూ కూర్చుంటే అధికారంలో ఉండలేవు. అధికారమే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం తప్ప ప్రజల శ్రేయస్సు కాదు. ఎందుకంటే అధికారంలో లేకుండా వీరు ప్రజాశ్రేయస్సును కోరరు. అధికారం ఉంటేనే వారు దీని గురించి ఆలోచన చేస్తారు. అందుకే రాజకీయాలన్నీ అధికారం చుట్టూ తిరుగుతాయి తప్ప నైతిక విలువల చుట్టూ కాదని వారికి తెలుసు. తెలియనిదల్లా సామాన్యులకే. అందుకే వారు అప్పుడప్పుడు ఇలా బాధ పడుతుంటారు. ఇటీవల పరిణామాలను గమనిస్తే నైతిక విలువల గురించి మాట్లాడుతున్న వారికి సమాధానం దొరక గలదు. రాజకీయాల్లో వాటి అవసరం ఉందా అనిపిస్తుంది. ఆయారామ్ గయారామ్‌లు చేరుతున్నా చట్టసభలు చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ మారిన వెంటనే చర్య తీసుకోవాలని చట్టం చెబుతోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యానయుడు ఒక్కరే ఆదర్శంగా నిలిచారు. అందుకే వేటువేయాలని ఆయన పదేపదే సూచించినా ఆయా రాష్ట్రాల్లో పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇలా చేయకపోవడం వల్ల చట్టరీత్యా చర్యలు లేకపోవడం కూడా కారణంగా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల తరవాత కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. వారు అనైతికంగా ఒక పార్టీలో గెలిచి అధికారంలో ఉన్న పార్టీల్లో చేరారు. వారిపై వేటు వేయడంలో ఇరు రాష్ట్రాల శాసనసభాధిపతులు చట్టాలను ఉల్లంఘించారు. అయితే కాంగ్రెస్, టిడిపి, వైకాపా,టిఆర్‌ఎస్‌లు ఇరు రాష్ట్రాల్లో వీటిపై భిన్నంగా మాట్లాడుతున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని బట్టి మళ్లీ నైతికత మారుతుందని గుర్తుచుకోవాలి. ఇకపోతే ఎపిలో వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. అలాగే తెలంగాణలో కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌లను ఎమ్మెల్యేగానే సస్పెండ్ చేశారు. కారణం ఏదైనా ఇదో అనైతికి చర్యగానే చూడాలి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసే విపరీత ధోరణికి ఇది తార్కాణంగా చూడాలి. అలాగే వైకాపాకు చెందిన కొందరిని ఎపిలో టిడిపిలో చేర్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్,టిడిపిలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇది చట్టవిరుద్దమైనా స్పందించలేదు. మొత్తంగా నైతిక విలువలు అన్నవి ఎవరికి వారు రాజకీయంగా అన్వయించుకునే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. దీనికి చట్టబద్దత అన్నది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలు ఆచరించే విలువల గురించి చర్చించడం సరికాదని ప్రజలు గమనించాలి. అందుకే అవసరాలను బట్టి పార్టీలు మారడం జరుగుతోంది. ఎన్నికల ముందు అటుఇటు మారుతుంటారు. అవసరాలను బట్టి పొత్తులకు వెళతారు. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి ఎపిలో టిడిపి,టిఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మహాకూటమికి సిద్దం అవుతోంది. ఇందులో కాంగ్రెస్‌తో టిడిపి జతకట్టబోతోంది. దీనిని తప్పుపట్టేవారు తప్పులు తెలుసుకోవాలి. ఎవరి రాజకీయ అవసరాలు వారివి అయినప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడడం మానుకోవాలి. కాబట్టి గతంలో ఏది తప్పు కాదో ఇప్పుడు కూడా తప్పుకాదు. గతంలో ఏది రైటో ఇప్పుడు అది కూడా రైటే. మారుతున్న కాలంలో విలువులు కూడా మారుతుంటాయి. రాజకీయ పార్టీలు అందుకు సిద్దంగా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా రాజకీయాలు ఉంటాయి తప్ప ప్రజలు నిమిత్తమాత్రులు. వారు కేవలం ఓటు వేయడానికి మాత్రమే పరిమితం అయ్యారు.